Constable Suicide in Bhadrachalam :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వంతెన పైనుంచి ఓ కానిస్టేబుల్ నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి తనకున్న అనారోగ్య కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అంతముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. తన తండ్రి ఇల్లు వరదలో మునిగిపోయిందని వీడియోలో తెలిపారు. కొంతకాలం క్రితం తనకు కారు యాక్సిడెంట్ జరిగి ప్రమాదానికి గురవడంతో పాటు తన భార్య ఆరోగ్యం క్షీణించటం, తన తండ్రి జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు వరదలో మునిగిపోవడం వల్ల మానసికంగా ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో చిత్రీకరించారు.
మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కానిస్టేబుల్ రమణారెడ్డి వీడియోలో తెలిపారు. గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ కోసం పోలీసు సిబ్బంది గజ ఈతగాళ్లు సాయంతో పడవల ద్వారా గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి నదికి వరద పెరిగి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల కానిస్టేబుల్ వరద ఉద్ధృతిలో చాలా దూరం కొట్టుకుపోయి ఉంటారని గజ ఈతగాళ్లు భావిస్తున్నట్లు తెలిపారు.
అసలు ఎలా తెలిసిందంటే : భద్రాచలంలో గోదావరి వంతెన పైనుంచి కానిస్టేబుల్ రమణారెడ్డి నదిలోకి దూకుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు చూశారు. దీంతో వెంటనే ఆ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం ఇచ్చి, గోదావరి వంతెనపై ఓ వ్యక్తి చెప్పులు, సెల్ఫోన్ వదిలేసి నదిలోకి దూకినట్లు చెప్పారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.