Dharmapuri Srinivas Died: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్, గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
ధర్మపురి అర్వింద్ భావోద్వేగం : తండ్రి మృతి పట్ల కుమారుడు, ఎంపీ ధర్మపురి అర్వింద్ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం దిల్లీలో ఉన్న ఆయన, 'అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇకలేరు. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కోరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా.. నువ్వు ఎప్పటికి నాతోనే, నాలోనే ఉంటావు' అంటూ ట్వీట్ చేశారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆయన, నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఉమ్మడి ఏపీలో 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్ మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన డీఎస్, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పని చేశారు.
ధర్మపురి శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానమిది :
- 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్‌లో జన్మించిన డి.శ్రీనివాస్
- విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన డీఎస్
- ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పని చేసిన డీఎస్
- 1989, 1999, 2004లో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన డీఎస్
- 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ మంత్రిగా డీఎస్
- 2004 - 2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మంత్రిగా డీఎస్
- 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్ బాధ్యతలు
- 2004లో భారాసతో కాంగ్రెస్ పొత్తులో డీఎస్ క్రియాశీలక పాత్ర
- 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వైఎస్‌తో కలిసి కీలక బాధ్యతలు
- సోనియా గాంధీకి విధేయునిగా డీఎస్‌కు గుర్తింపు
- ప్రణబ్ ముఖర్జీ, తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు
- 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా డీఎస్ బాధ్యతలు
- తెలంగాణ ఆవిర్భావం అనంతరం మండలి విపక్ష నేతగా పనిచేసిన డీఎస్
- రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో డీఎస్ అసంతృప్తి
- 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన డి.శ్రీనివాస్
- తెలంగాణ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పని చేసిన డీఎస్
- 2016 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్
- రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్తో విభేదించిన డీఎస్
- కాంగ్రెస్ నేతలతో మంతనాలు, తిరిగి సొంతగూటికి చేరిన డీఎస్