Congress Leaders Meeting Started at Praja Bhavan : ఆగస్టులోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గురువారం(రేపు) సాయంత్రం 4 గంటలకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ రైతుల ఖాతాల్లోకి వెళుతుందన్నారు. ప్రతి రైతుకు రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో కాంగ్రెస్ నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. గడిచిన ఏడు నెలల పాలనపై సమీక్షించారు.
"రేపు లక్ష రూపాయల వరకు రైతు రుణాలకు నిధులు విడుదల చేస్తాం. ఈ నెలాఖరులోపు రూ.1.5 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ జరుగుతుంది. ఆగస్టులో రూ.2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. చిత్తశుద్ధితో ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం"- సీఎం రేవంత్ రెడ్డి
రుణమాఫీ పేరుతో కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్పారు. అందుకే ఏకమొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అని మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ శ్రేణులకు వివరించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండని, దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత మొత్తంలో మాఫీ చేయలేదు : దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంటులో ఎంపీలు ప్రస్తావించాలని చెప్పారు. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబురాలు జరగాలని అన్నారు. ఏడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.