Congress Complaint on Social Media Handles :గతంలో ఎన్నడూ లేనివిధంగా సామాజిక మాధ్యమాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో చెరువులు, కుంటలు, కాలువలపై ఏర్పాటు చేసిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. భాగ్యనగరంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆక్రమణల తొలిగింపు, మూసీ ప్రక్షాళన కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని యూట్యూబ్ చానళ్ల ప్రతినిధులు బాధితుల అభిప్రాయాలను తీసుకొని, ఆవేశంతో బాధితులు మాట్లాడిన మాటలని ఎడిట్ చేయకుండానే సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్నారు.
అలాంటి వీడియోలను ట్రెండింగ్ చేస్తూ :మరికొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించడం వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క వంటివారిపై వ్యక్తిగత విమర్శలుచేస్తూ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీకి విలువ ఇవ్వకుండా నోటికొచ్చినట్లు విమర్శలు చేయడం, దుర్భాషలాడడం వంటి వీడియోలని ట్రెండింగ్ చేయిస్తున్నారు. అలా చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైనప్పుడు సామాజిక మాధ్యమాల్లోని వీడియోలపై చర్చించారు. అడ్డు అదుపులేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు పెడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఘటనలను స్థానిక పరిస్థితులకు అన్వయిస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం శ్రుతిమించడంతో ప్రభుత్వం కఠినంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.