Congress Leaders Celebration on Rythu Runa Mafi :రైతు రుణమాఫీ అమలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లబ్దిచేకూర్చడంపై రైతులు సంబరాల్లో మునిగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు వద్ద రూ. 2 లక్షల రుణమాఫీని హర్షిస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ అమలుని స్వాగతిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు.
Farmers Celebration on Rythu Runa Mafi: హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ సెంటర్ నుంచి డిపో వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ అనుకూల నినాదాలు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే నాగరాజు రైతులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి శ్రీధర్‌బాబు సోదరుడు శీనుబాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో రుణమాఫీ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం రైతువేదికలో రుణమాఫీ అమలును సంతోషిస్తూ నిర్వహించిన సంబరాల్లో రైతులతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. జగిత్యాలలో జరిగిన సంబరాల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు. పట్టదారు పాసు పుస్తకం కలిగి ఉన్న ప్రతిరైతుకు ప్రయోజనం కలుగుతుందని నేతలు స్పష్టం చేశారు. ఏక కాలంలో 60 లక్షల మంది సాగుదారులకు రుణవిముక్తి లభిస్తుందన్నారు.