Attack on Female Journalists in Nagarkurnool :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో కాంగ్రెస్ వర్గీయులు తమపై దాడి చేశారంటూ ఇద్దరు మహిళా జర్నలిస్టులు గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెల్దండ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్సై మహేందర్ వివరాల మేరకు రుణమాఫీపై కొండారెడ్డిపల్లిలో రైతులతో సర్వే చేస్తుండగా గ్రామ యువకులు తమపై దాడికి దిగారంటూ రెండు యూట్యూబ్ ఛానెళ్ల జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి ఆరోపించారు. తమ ఫోన్లు లాక్కొని దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
మహిళా జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐ, ఎస్సైతో మాట్లాడారు. జర్నలిస్టులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం జర్నలిస్టులు తమ వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరగా కొందరు కాంగ్రెస్ నేతలు తమను వెంబడిస్తున్నారంటూ వెల్దండ ఠాణాను ఆశ్రయించారు. కొద్దిసేపు పోలీస్ స్టేషన్‌లో వారికి, కాంగ్రెస్ నాయకులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఆ నేతలను అక్కడి నుంచి పంపేశారు. జర్నలిస్టులకు సీఐ, ఎస్సైల వాహనాల్లో రక్షణ కల్పించి హైదరాబాద్‌కు పంపించేశారు.
Crime Journalist Murdered : క్రైమ్ జర్నలిస్ట్ దారుణ హత్య.. ఇంటి తలుపు తట్టి.. కాల్పులకు తెగబడి..
KTR on Attack on Female Journalists :ఈ ఘటనపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో హామీలు అమలు చేయాలని కోరుతూ రైతులు, విద్యార్థులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు ప్రశ్నించినా పోలీసుల, గూండాలతో దాడులు చేయిస్తారా? అంటూ మండిపడ్డారు. ప్రశ్నించడమే పాపమా అంటూ నిలదీశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై, కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడులు చేశారని కేటీఆర్ ఆరోపించారు.