తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనెల 25న తెలంగాణ బడ్జెట్! - రూ. 2.50 లక్షల కోట్లతో పద్దు? - TELANGANA BUDGET 2024 - TELANGANA BUDGET 2024

Telangana State Budget Actual Expectations : ఈనెల 25న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అందులో భాంగగా (2024-25) బడ్జెట్‌ను వాస్తవ అంచనాలను మాత్రమే తయారు చేసేవిధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల​పై స్పష్టత వచ్చిన తరువాత బడ్జెట్​పై పూర్తి స్థాయిలో కసరత్తు జరగనుంది.

State Budget
State Budget (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 8:43 AM IST

Telangana State Budget 2024-25 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) బడ్జెట్‌ను వాస్తవ అంచనాలను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్థిక శాఖకు సూచించింది. ఆదాయ, వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా, ఎంతమేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంతమేరకే కేటాయింపులతో రూపొందించాలని నిర్దేశించింది.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బడ్జెట్‌ అంచనాల ప్రకారం వంద శాతం వ్యయం చేయలేదు. ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక బడ్జెట్ ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత పదేళ్లలో 2019-20 లో మాత్రమే బడ్జెట్‌ అంచనాల్లో 97.5% వ్యయమైందని శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం, రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్‌ రూ.2.50 లక్షల కోట్ల వరకు చేరే కనిపిస్తున్నాయి.

ఈ నెల 25 న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని అడిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆమోదించగానే అధికారులు తేదీని అధికారికంగా వెల్లడించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 23వ తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నందున వెంటనే రాష్ట్ర బడ్జెట్‌కు నిధుల కేటాయింపుపై తుదిరూపు ఇవ్వనున్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించే రుణాలను కలిపి రూ.60 వేల కోట్లకు పైగానే ఉండవచ్చని ప్రాథమిక అంచనా.

హల్వా వండిన నిర్మలమ్మ- బడ్జెట్​లో​ నిమగ్నమైన అధికారులు

గతేడాది వ్యయం రూ.2.11 లక్షల కోట్లు : ఇటీవల కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం (2023-24) రాష్ట్రానికి రూ.2.59 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేసింది. చివరికి రుణాలతో కలిపి రూ.2.18 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. వ్యయం రూ.2.49 లక్షల కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తే రూ.2.11 లక్షల కోట్లే ఖర్చు చేసినట్లు కాగ్ వెల్లడించింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.38,234 కోట్ల రుణాలను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఏకంగా రూ.49,589 కోట్ల రుణాలను సేకరించింది. ఇలా లక్ష్యానికి మించి రుణాలను సేకరించినా ఆదాయం రూ.2.18 లక్షల కోట్లే ఉందని కాగ్‌ తన నివేదిక వివరించింది.

కేంద్ర గ్రాంట్లపై స్పష్టత వచ్చిన తర్వాతే: కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో పెద్దఎత్తున నిధులు వస్తాయనే అంచనాలతో బడ్జెట్‌ రూపొందించి, చివరికి అవి రాకపోవడంతో వ్యయ లక్ష్యాలను సాధించలేకపోతున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది. 2023-24లో కేంద్రం నుంచి రూ.41,259 కోట్ల గ్రాంట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. చివరికి రూ.9,729.91 కోట్లు మాత్రమే వచ్చాయి.

అంటే ఊహించిన దాంట్లో 23.58% మాత్రమే కేంద్రం కేటాయించింది. కేంద్రం గ్రాంట్లలో 76.42% సొమ్మును ఇవ్వకపోవడంతో, రాష్ట్ర ఆదాయం రూ.2.18 లక్షల కోట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో 23న కేంద్ర బడ్జెట్‌ను జాగ్రత్తగా పరిశీలించి, గ్రాంట్లపై స్పష్టమైన అవగాహన వచ్చిన అనంతరం రాష్ట్ర ఆదాయ, వ్యయాల మొత్తాలను రుపొందించాలని ఆర్థికశాఖకు ప్రభుత్వం సూచనలు చేసింది.

ఆగస్టులోపే 3 దశల్లో రుణమాఫీ పూర్తి - రేపు రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి : సీఎం రేవంత్ - congress Meeting at Praja Bhavan

ABOUT THE AUTHOR

...view details