Collegium Recommends Appointment of 3 Lawyers as Andhra Pradesh High Court Judges :ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు హైకోర్టులో న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, గుణరంజన్, చంద్ర ధనశేఖర్ పేర్లను సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ హైకోర్టులో న్యాయవాదులుగా సేవలందిస్తోన్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, గుణరంజన్‌ను అదే హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌తో కూడిన కొలీజియం మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, హైకోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులను సంప్రదించి ఈ ముగ్గురినీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ మే 15న పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొలీజియం పేర్కొంది.
'ఓసారి నా స్థానంలో కూర్చోండి - ఎంత ఒత్తిడి ఉంటుందో మీకే తెలుస్తుంది' - న్యాయవాదులపై CJI తీవ్ర అసహనం
కుంచం మహేశ్వరరావు కె.సుశీలమ్మ, కె. కోటేశ్వరరావు దంపతులకు తిరుపతిలో జన్మించారు. తిరుపతిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1998లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. అనంతపురం జిల్లా కోర్టులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. తర్వాత ప్రాక్టీసును హైకోర్టుగా మార్చారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద కొంత కాలం జూనియర్‌గా ప్రాక్టీసు చేశారు. తర్వాత సొంతగా ప్రాక్టీసు ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధ కేసుల్లో పట్టు సాధించారు. హైకోర్టు ప్యానల్ న్యాయవాదిగా.. భారత బార్ కౌన్సిల్, ఎఫ్‌సీఐ, సహా పలు బీమా సంస్థలకు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.