Collecting More Money at Medaram Jatara Toll Plaza : ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరొందినమేడారం మహా జాతర మరో 20 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల భక్తులు భారీగా తరలివచ్చి ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రైవేటు వాహనాల ద్వారా జాతరకు వచ్చే భక్తులకు టోల్‌గేట్ కష్టాలు తప్పట్లేదు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారు నాలుగు టోల్ గేట్లు దాటాల్సి వస్తోంది. మరోవైపు వాహనాల రద్దీ మూలంగా ట్రాఫిక్ సమస్యలు సైతం వస్తూనే ఉన్నాయి.
Telangana Medaram Jatara 2024 : హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు కనీసం రూ.550 టోల్ ఛార్జీలు పడుతున్నాయి. యాదాద్రి జిల్లా గూడూరు, జనగామ జిల్లా కోమల్ల, హనుమకొండ జిల్లా కోమటిపల్లి, ములుగు జిల్లా జవహర్నగర్ వద్ద టోల్‌గేట్లలో వాహనాల స్థాయిని బట్టి రూ.2 వందల వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలోని పస్రా, ఏటూరు నాగారం, తాడ్వాయిలలో అటవీ శాఖ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. పర్యావరణ పరిరక్షణ ఛార్జీల పేరుతో భారీ వాహనాలకు రూ.2 వందలు, లైట్ మోటారు వాహనాలకు రూ.50ల చొప్పున తీసుకుని రశీదు అందిస్తున్నారు. ఇక మేడారంలోని పంచాయతీ సిబ్బంది పార్కింగ్ రుసుమలు వసూలు చేస్తున్నారు. మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని అదనపు భారం తగ్గించాలని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాబోయ్ ఇదేం బాదుడు - మేడారం వెళ్లాలంటే ఇన్ని ఛార్జీలు కట్టాలా?
Minister Konda Surekha on Medaram Toll Plaza :మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.ప్రభుత్వం సూచన మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశం మేరకు ఫిబ్రవరి 2నుంచి 29వరకు పర్యావరణ రుసుం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.