CNG Filling Stations Shortage : పెట్రోల్, డీజిల్‌తో పోల్చుకుంటే సీఎన్జీ ధర కాస్త తక్కువగానే ఉంటుంది. అందుకే ఎక్కువ మంది సీఎన్జీ వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. గ్రేటర్ పరిధిలో సీఎన్జీ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నప్పటికీ అందుకు తగ్గట్లు బంకులు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ 2,000ల కిలోల వరకు సీఎన్జీ స్టాక్ రావాల్సి ఉండగా, కేవలం 200ల కిలోలు మాత్రమే వస్తోందని కొందరు డీలర్లు చెబుతున్నారు.
గ్రేటర్ పరిధిలో సీఎన్జీ బంకుల కొరత :నగరంలోని సీఎన్జీ వాహనాలకు అనుగుణంగా 100కి పైగా బంకులు ఉండాలి. కానీ గ్రేటర్ పరిధిలో కేవలం 55 సీఎన్జీ బంకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో కంపెనీ అవుట్ లెట్లయిన కోకో బంకుల్లో సరిపడా స్టాక్ ఉంచేందుకు రెండు నుంచి మూడు వాహనాలు అందుబాటులో ఉంచుతున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. తార్నాక, కొత్తపేట తదితర ప్రాంతాల్లోని కోకో స్టేషన్లలో స్టాక్ సరిపడా ఉండడంతో అక్కడ వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ ప్రాంతాల్లో గంట నుంచి గంటన్నర వరకు ఆగితే తప్ప ఇంధనం లభించే పరిస్థితి లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని బంక్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ సీఎన్జీని వాహనాల్లో నింపడానికి గంట నుంచి రెండు గంటలు సమయం పడుతుందని వాహనదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సీఎన్జీ వాహనదారులకు తప్పని ఇంధన ఇక్కట్లు :గ్రేటర్ పరిధిలోని సీఎన్జీ బంకుల్లో ప్రతి రోజూ సుమారు లక్ష కేజీల సీఎన్జీ అవసరం ఉంటుందని అంచనా. ఒక్కో బంకులో 1,500ల నుంచి 2వేల కేజీల సీఎన్జీ అవసరం ఉంటుంది. రోజూ కేవలం 200ల కిలోల సీఎన్జీ గ్యాస్ మాత్రమే సరఫరా అవుతోంది. డెలివరీ చేసే ట్రక్ సామర్థ్యం 200ల కేజీలు మాత్రమే. అది అయిపోతే మళ్లీ మరుసటి రోజే స్టాక్ వస్తుంది. దీంతో స్టాక్ వచ్చిన గంటన్నర వ్యవధిలోనే నో స్టాక్ బోర్డులు పెట్టక తప్పడంలేదని డీలర్లు వాపోతున్నారు. ఓయూ క్యాంపస్ సమీపంలోని హెచ్‌పీ బంక్‌లో, ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సీఎన్జీ బంక్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు ఆటోలు కార్లు రోడ్డుపై బారులు తీరుతున్నాయి.