Telangana Cabinet Expansion Temporarily Postponed :తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ ప్రెసిడెంట్ నియామకం తాత్కాలికంగా వాయిదా పడింది. ముఖ్యనేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం, మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం.
వారం, పది రోజుల తర్వాత దీనిపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పీసీసీ నియామకంలో బీసీలకు అవకాశం కల్పించాలని ఒక అభిప్రాయానికి వచ్చినా, ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడానికి కొంత సమయం పడుతుందని నేతలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం వేచి చూసి ఆ తరువాత చర్చించడం మంచిదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.
కేబినెట్ విస్తరణపైన మరోసారి చర్చిస్తామన్న కాంగ్రెస్ నేతలు : ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు నియామకం, క్యాబినెట్ విస్తరణపై కసరత్తు కొలిక్కిరాలేదని భేటీకి హాజరైన నేతలు వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీల సమక్షంలో జరిగిన ఈ కీలక భేటీలోను ఏకాభిప్రాయం కుదరలేదన్నారు.
తమ అభిప్రాయాలను అధిష్ఠానం అడిగి తెలిసుకున్నట్లు నేతలు వివరించారు. ఈ క్రమంలోనే ఈ ప్రక్రియ వాయిదా పడ్డట్లు, మరోమారు నేతలతో చర్చల ప్రక్రియ మొదలు పెట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతల పరస్పర అంగీకారం అనంతరం పీసీసీ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.