CM Revanth to Inaugurate Aramghar-Zoo Park Flyover :ఆరాంఘర్ - జూపార్కు పైవంతెన ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. నగరం నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు 4.08 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.800 కోట్లతో పైవంతెనను బల్దియా నిర్మించింది. ఈ ఫ్లైఓవర్ నగరంలో పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత రెండో అతిపెద్ద వంతెన కావడం విశేషం.
రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ :హైదరాబాద్‌లో రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడటమే కాకుండా కోట్లాది రూపాయల ఇంధనం, విలువైన సమయం వృథా అవుతోంది. నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు జీహెచ్‌ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పైవంతెనలు, ఆర్వోబీలను నిర్మిస్తూ ట్రాఫిక్ ఇక్కట్లను దూరం చేస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎస్‌ఆర్‌డీపీ ద్వారా చేపట్టిన ఫ్లైఓవర్లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికి 42 పనుల్లో 36 పూర్తయ్యాయి. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు చేపట్టిన 6 వరుసల రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ ఈరోజు నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. గతేడాది డిసెంబర్లోనే ఈ ఫ్లైఓవర్ ప్రారంభించాల్సి ఉండగా, సర్వీసు రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఆలస్యమైంది.