CM Revanth Reddy meet with Management of Engineering Colleges : ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్ కళాశాలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా కళాశాలలు ఉండకూడని అన్నారు. జేఎన్టీయూలో ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అనే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, జేఎన్టీయూ వీసీ బుర్రా వెంకటేశంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలు అందరికీ తెలిసే విధంగా ప్రస్తుత కార్యక్రమం ఉందని పేర్కొన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ విధానం కీలకమని స్పష్టం చేశారు. మ్యాన్‌మేడ్ వండర్స్‌ను క్రియేట్ చేసిందే ఇంజినీర్లు అని కొనియాడారు. ప్రపంచంలోని దేశాల్లో గొప్పగా ఏదైనా ఉంటే దాన్ని చేసింది ఇంజినీర్లే అని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైంది సివిల్ ఇంజినీరింగ్ అని తెలిపారు.
కొన్ని కళాశాలల్లో సివిల్ ఇంజినీరింగ్‌ను లేకుండా చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను కచ్చితంగా నడపాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మూడు కోర్సులు లేకపోతే దేశం ప్రమాదాన్ని ఎదురుకుంటుందని హెచ్చరించారు. ఉద్యోగాలు సృష్టించే సంస్థలుగా కాకుండా మేధావులను అందించే సంస్థలు ఉండాలన్నారు.
తొలిసారి ఫీజు రియింబర్స్‌మెంట్ పెట్టిందే కాంగ్రెస్ : తొలిసారి ఫీజు రీయింబర్స్మెంట్ విధానం ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. జేఎన్టీయూ పరిధిలో కళాశాలలు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రభుత్వ విధానం గురించి తెలవాలని సీఎం స్పష్టం చేశారు. లక్ష మంది ఇంజినీరింగ్ పట్టాలు పొందిన వారికి ప్రభుత్వ విధానం తెలుస్తుందని చెప్పారు. ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ లోగోను సీఎం, మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.