CM Revanth Letters to PM Modi :తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేవలం 27 రోజుల్లోనే 22,22,067 మంది కర్షకులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ కింద రూ.17,869.22 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే అతిపెద్ద రైతు పంట రుణమాఫీ అని ఆయన పేర్కొన్నారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు సైతం త్వరలో మాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అంటే బంగారు (గోల్డెన్) గ్యారంటీ అని రైతుల నమ్మకం అని తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి, సీఎం రేవంత్ లేఖ రాశారు. అందులోని అంశాలను ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
గణాంకాలు విడుదల : శనివారం నాడు ‘‘మహారాష్ట్రలో జరిగిన ఒక బహిరంగ సభలో మీరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులకు పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, దాని అమలు కోసం కర్షకులు ఇంకా ఎదురుచూస్తున్నారని అన్నారు. మీ ప్రకటన నాకు చాలా బాధ కలిగించింది, అది వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు. మీకు పూర్తి నిజాలను గణాంకాలతో సహా వివరిస్తున్నాను అంటూ లెటర్ విడుదల చేశారు. "రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవంతంగా రుణమాఫీని అమలు చేసింది. మొదటి విడతలో జులై 18వ తేదీన 11,34,412 మందికి రూ.లక్ష వరకు రూ.6034.97 కోట్లను విడుదల చేశాం. అలాగే రెండో విడతగా జులై 30వ తారీఖున 6,40,823 మందికి రూ.1.50 లక్షల వరకు రూ. 6190.01 కోట్లను జమ చేశాం. మూడో విడతగా ఆగస్టు 15న 4,46,832 మందికి రూ.2 లక్షల వరకు రూ.5644.24 కోట్లను మాఫీ చేశాం. మొత్తంగా 22,22,067 మందికి రూ.17,869.22 కోట్లను మాఫీ చేశాం.
ఇది రైతు సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ అంకితభావాన్ని చాటుతోందని దృఢంగా నమ్ముతున్నాను. పంట రుణమాఫీతో రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించి, అప్పుల ఒత్తిడి లేకుండా వారు రాష్ట్ర పంట దిగుబడులలో, వ్యవసాయ ఉత్పాదకత పెంపుదలలో కీలక పాత్ర పోషించేందుకు దోహదపడుతుందని విశ్వసిస్తున్నాను. రూ.2 లక్షలకు పైగా పంట రుణాలు ఉన్న రైతులు అదనపు మొత్తాన్ని చెల్లిస్తే ప్రభుత్వం రూ.2 లక్షలను డిపాజిట్ చేస్తుంది. కష్టజీవులైన రైతులకు ఇచ్చిన పంట రుణమాఫీ హామీని నిర్ణీత కాలపరిమితితో పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే వార్షిక బడ్జెట్‌లో రుణమాఫీ కోసం రూ.26 వేల కోట్లను కేటాయించింది. అర్హత గల ప్రతి రైతుకు పంట రుణమాఫీ చేసేందుకు రూ.31 వేల కోట్లు కేటాయించేందుకు సిద్ధమయింది.