CM Revanth Reddy visits Keslapur and Indravelly Today : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లాల పర్యటనకు వెళ్లిన రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) ఆదిలాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరిన సీఎం, కేస్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, ప్రేంసాగర్, సీఎస్ శాంతికుమారి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
త్వరలో మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం - కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
CM Revanth Reddy Adilabad Tour : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి నాగోబా ఆలయానికి వెళ్లారు. నాగోబా దర్శనానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి మోస్త్రం వంశీయులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివాసీ సంప్రదాయ రీతిలో ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, 6 కోట్లతో చేపట్టనున్న నాగోబా(Nagoba Temple) ఆలయ అభివృద్ది పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
5 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన ఆలయ గోపురం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సందర్భంగా సీఎం ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత, నాగోబా ఆలయం పక్కన ఉన్న దర్బార్ హాల్లో కేస్లాపూర్ స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను వీక్షించారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన పురోగతిని సీఎంకు వారు వివరించారు. అనంతరం, కేస్లాపూర్‌లో మహిళా సంఘాల సభ్యులతో జరిగిన ముఖాముఖిలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.