CM Revanth Reddy Visit Ramoji family Members :రామోజీ గ్రూప్ ఛైర్మన్, దివంగత రామోజీరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరిన రామోజీరావు చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆరోజు సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటనలో ఉండటంతో అక్షరయోధుని పార్థివదేహానికి నివాళులర్పించలేకపోయారు.
రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మల్‌రెడ్డి రాంరెడ్డి, మధుసుధన్ రెడ్డిలు రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్లారు. రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.
రామోజీరావు వ్యక్తి కాదు, వ్యవస్థ - ఆయనకు ప్రత్యామ్నాయం లేదు :రామోజీరావుతో తనకు ఉన్న అనుంబంధాన్ని ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరితో పంచుకున్నారు. రామోజీరావు వ్యక్తి కాదు, వ్యవస్థ అని, ఆయనకు ప్రత్యామ్నాయం లేదన్నారు. రామోజీ చూపిన మార్గంలో వారి కుటుంబ సభ్యులు, సంస్థలు ప్రజల తరఫున నిలబడాలని ఆకాంక్షించారు. రామోజీరావు ఆలోచనా విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అనంతరం తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాలను పంచుకున్నారు.