రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నా : సీఎం రేవంత్‌రెడ్డి CM Revanth Reddy Visit Medaram : మేడారం సమ్మక్క- సారలమ్మలను సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి(CM Revanth Reddy) మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, ఇతర ప్రభుత్వాధికారులు స్వాగతం పలికారు. గద్దెల మీదికి చేరుకున్న వనదేవతలకు సీఎం రేవంత్‌రెడ్డి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నానని తెలిపారు.
ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నేను ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే ప్రారంభించాను. హాథ్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించాను. మేడారం జాతరకు(Medaram Jathara)భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రూ.110 కోట్లు మంజూరు చేశాం. పాలకులు ప్రజలను పీడించినప్పుడు ఎవరో ఒకరు నిలబడతారు. సమ్మక్క, సారలమ్మ నుంచి స్ఫూర్తి పొంది పోరాడామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
తండాలు, గూడేల్లోనూ ప్రజాపాలన ప్రజలకు చేరువవుతోంది. ప్రజల అవసరాలను అడిగి తెలుసుకుని తదనుగుణంగా ముందుకెళ్తాం. ప్రజల అజెండానే మా అజెండాగా ముందుకు వెళ్తాం. మేడారంను జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కిషన్‌రెడ్డి(Kishan reddy) చెప్పడం విన్నాను. కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహిస్తోంది. కుంభమేళాకు కేంద్రం వందల కోట్లు నిధులు విడుదల చేసింది. దక్షిణాది కుంభమేళా మేడారం జాతరకు కేవలం రూ.3 కోట్లు కేటాయించింది. మేడారం జాతరపై వివక్ష చూపడం సరికాదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈనెల 27న సాయంత్రం రెండు గ్యారంటీలను ప్రారంభిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth on Medaram as National Festival :కేంద్రప్రభుత్వం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందనేందుకు జాతర పట్ల కేంద్రం తీరే నిదర్శనమని సీఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. మేడారం జాతరకు ప్రధాని మోదీ, అమిత్‌షాను ఆహ్వానిస్తున్నాం. జాతరకు వచ్చి మోదీ, అమిత్‌షా సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవాలి. సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడం తప్పుకాదు, పాపం కాదు. అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలని మోదీ, అమిత్‌షా చెప్పారు. అయోధ్యలో రాముడి మాదిరిగానే సమ్మక్కను మోదీ, అమిత్‌షా అలాగే దర్శించుకోవాలి. మోదీ, అమిత్‌షాకు స్వాగతం పలికే బాధ్యత నేను, మంత్రివర్గం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.
మేడారానికి జాతీయ హోదా ఇవ్వలేమంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆదివాసీలను అవమానించవద్దంటూ సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎంగా కేసీఆర్ మేడారం సందర్శించక నిర్లక్ష్యం చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు. భవిష్యత్తులో మీకు అదే పరిస్థితి వస్తుందని కిషన్‌రెడ్డికి చెబుతున్నాను. కేంద్రం ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ వివక్ష చూపడం మంచిది కాదు. దక్షిణ భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మేడారం జాతరకు గుర్తింపు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
"రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నాను. పాలకులు ప్రజలను పీడించినప్పుడు ఎవరో ఒకరు నిలబడతారు. సమ్మక్క, సారలమ్మ నుంచి స్ఫూర్తి పొంది పోరాడాము. కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహిస్తోంది. మేడారం జాతరపై వివక్ష చూపడం సరికాదు". - సీఎం రేవంత్‌రెడ్డి
ఏపీపై ఓ కన్నేసి ఉంచండి - వేసవిలో తాగునీటి సమస్య రావొద్దు : సీఎం రేవంత్ రెడ్డి
విద్యుత్ కోతలు విధిస్తే సస్పెండ్ చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి