CM Revanth Reddy Unveils BR Ambedkar Statue : ప్రొఫెసర్ల వయో పరిమితి 65కు పెంచే ఆలోచన ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే వర్సిటీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వీసీలను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సమాజానికి కావాల్సిన చికిత్స బాధ్యత వీసీలపై పెడుతున్నామని తెలిపారు. వర్సిటీల వీసీలుగా అన్ని సామాజిక వర్గాల నుంచి ఉండాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్‌లోని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడారు.
ప్రణాళికాబద్ధంగా వర్సిటీలు ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వర్సిటీల ప్రణాళికలను అమలు చేసే బాధ్యత తనది అని చెప్పారు. తెలంగాణ సమాజం పదేళ్ల పాటు కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు. వర్సిటీల పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మౌలిక వసతులు కల్పించినంత మాత్రాన వర్సిటీల ప్రతిష్ట పెరగదని వ్యాఖ్యానించారు.
"యూజీసీ నిబంధనలు మార్చి వర్సిటీల స్వయం ప్రతిపత్తిని హరించాలని చూస్తున్నారు. వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వ హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుంది. కేంద్రం కుట్రలను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే. రాష్ట్రాలకు ఏం కావాలో కేంద్ర ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది. పక్క రాష్ట్రాల సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతాం. యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి. రాష్ట్రంపై కేంద్రం దండయాత్ర చేస్తోంది. ఇది మంచిది కాదు. ఇలాంటి విధానాలు పాటిస్తే రాజ్యాంగం మనుగడ సాగిస్తుందా? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోనే అధికార విభజన ఉంది." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి