CM Revanth On Hyderabad Real Estate : హైదరాబాద్‌లో గత ఆరునెలల్లో రియల్ ఎస్టేట్ పుంజుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశీయ, అంతర్జాతీయ ఆఫీస్ స్పేస్ లీజు రంగంలో 40 శాతం వృద్ధిలో దూసుకెళ్తుందని తెలిపారు. ఫలితాలను సాధించడమే ఏకైక లక్ష్యంతో హడావిడి లేకుండా పనిచేస్తున్న సమర్థవంత ప్రభుత్వ ప్రయోజనాలివని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఇమేజ్ను పునర్నిర్మిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రయాణంలో ప్రతీ ఒక్కరికి అవకాశాలను సృష్టిస్తామని భరోసా ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Hyderabad Real Estate :అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశీయ కంపెనీల కార్యాలయాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడంతో ఇక్కడి కార్యాలయాల స్థలాలకు గిరాకీ పెరిగింది. ఈ ఏడాదిలో మొత్తం 50 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది. గత ఏడాది ఇదే కాలంలో 36 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సంస్థలు అద్దెకు తీసుకున్నాయి. దీంతో పోలిస్తే ఈసారి అద్దె లావాదేవీల్లో 40శాతం వృద్ది కనిపించిందని స్థిరాస్తి సేవల సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ప్రముఖ సంస్థలు తమ వ్యాపార విస్తరణకు హైదరాబాద్ కీలక స్థానంగా భావిస్తున్నాయని పేర్కొంది.
అందుబాటలో ఉండటమే హైదరాబాద్‌లో కార్యాలయ స్థలానికి గిరాకీ పెరిగేందుకు ఇక్కడి మౌలిక వసతులతో పాటు, అనువైన వ్యాపార విధానాలు, స్థిరమైన ప్రభుత్వం లాంటివి తోడ్పడుతున్నాయని నివేదిక పేర్కొంది. ఇక్కడ స్థిరాస్థి ధరలు అందుబాటలో ఉండటం, నిఫుణుల లభ్యతా అనుకూలంగా ఉందని తెలిపింది. దీంతో హైదరాబాద్‌పై పెట్టుబడిదారులు, స్థిరాస్థి డెవలపర్లు, సంస్థలూ సానుకూలంగా ఉంటున్నట్లు వెల్లడించింది. భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు వీలుగా ఉండేలా చూసుకోవడంతో పాటు, ఆధునిక వసతులు, కీలక ప్రాంతాల్లో ఉన్న గ్రేడ్ ఏ వాణిజ్య ప్రాజెక్టులకు అధిక గిరాకీ ఉందని నివేదిక పేర్కొంది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కొత్తగా 27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది.