CM Revanth Reddy Mahabubnagar Tour : పాలమూరు-రంగారెడ్డి తప్ప మిగిలిన అన్ని ప్రాజెక్టులు 18 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం ముందుగా అక్కడి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటారు. అలాగే కలెక్టరేట్ వద్ద మహిళ శక్తి క్యాంటిన్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కేవలం మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.396.09 కోట్లతో ఈ పనులను ప్రారంభించారు.
పలు పనులకు శంకుస్థాపన చేసిన సీఎం :
- పాలమూరు వర్సిటీలో ఎస్టీపీ, అకడమిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు శంకుస్థాపన
- ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన
- మహబూబ్‌నగర్ రూరల్, గండీడ్‌లో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
- మహబూబ్‌నగర్‌లో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన
- మహబూబ్‌నగర్‌లో రూ.276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన
- దేవరకద్రలో రూ.6.10 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ముగిసిన సీఎం రేవంత్ సమీక్ష : ప్రతి ప్రాజెక్టు వారిగా సూక్ష్మ స్థాయిలో స్టేటస్ రిపోర్ట్ తయారు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. మండలం, గ్రామ వారీగా ఆయకట్టు వివరాలను రూపొందించాలను సూచించారు. ప్రతి ప్రాజెక్టుకు స్టేటస్ రిపోర్టు ఉండాలని తెలిపారు. ఆయా ప్రాజెక్టుల కింద కొత్త ప్రతిపాదనలను న్యాయపరమైన వివాదాలకు అవకాశం లేకుండా రూపొందించాలని వివరించారు. ప్రస్తుతం చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. ప్రతి ప్రాజెక్టుపై 30 రోజులకు ఒకసారి సమీక్షిస్తానని తెలిపారు. అన్ని ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించి పూర్తి నివేదికలివ్వాలని అధికారులకు చెప్పారు.