Praja Palana Celebrations :చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోందని, త్వరలోనే గ్రూప్ 1 నియామక పత్రాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ పునరావాస కేంద్రాలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని సీఎం ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ వేడుకలను రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత ముఖ్యంగా విద్య, వైద్యం అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 6,500 మందిని కొత్తగా వైద్యారోగ్య శాఖలో నియమించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏడాదిలో వైద్యారోగ్య శాఖలో 14 వేల మంది నియామకం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 8 వైద్య కళాశాలు ఇచ్చి ఎలాంటి వసతులు కల్పించలేదని మండిపడ్డారు. తెలంగాణ యువత ఉద్యోగాల కోసమే పోరాటం చేసిందని గుర్తు చేశారు. స్వరాష్ట్రం వచ్చాక ఉద్యోగాలు వస్తాయని యువత ఎంతో ఆశపడితే, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామక పరీక్షలు నిర్వహించిన పేపర్ లీక్‌లను అరికట్టలేకపోయారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
"అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని యువతకు నమ్మకం కలుగుతోంది. పరీక్షలు వాయిదా వేస్తూ పోతే యువత విలువైన యుక్త వయసు వృథా అవుతుంది. మన భవిష్యత్తు 21 నుంచి 35 ఏళ్లలోపు చేసే పనులే నిర్ణయిస్తాయి. ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేస్తే యువత కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ తల్లిదండ్రులకు భారంగా మారుతారు. పరీక్షలు వాయిదా వేస్తే యువత ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పరీక్షలు నిర్వహిస్తే ఉత్తీర్ణత సాధించిన వారు ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగాలు రానివారు మరో పనో, వ్యాపారమో చేసుకుంటారు." అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.