New Osmania Hospital at Goshamahal :హైదరాబాద్‌లోని గోషామహల్ లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మాణానికి అవసరమైన కార్యచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోషామహల్‌లోని 32 ఎకరాలను వెంటనే పోలీసు శాఖ నుంచి వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి నిర్మాణ డిజైన్లు ఉండాలని అధికారులకు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునేలా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు.
ఆసుపత్రికి అవసరమైన వివిధ విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, అన్ని సేవలు అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు. కేవలం కాంక్రీట్ భవంతులు, బహుళ అంతస్తులు కాకుండా ఆహ్లాదకరమైన విశాలమైన ఖాళీ ప్రాంగణం ఎక్కువగా ఉండేలా డిజైన్లు ఉండాలని, అనుభవజ్ఙులైన ఆర్కిటెక్ట్స్లతో తయారు చేయించాలని వివరించారు. ఇప్పుడున్న ఉస్మానియా ఆస్పత్రి భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షిస్తామని మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునే చారిత్ర భవనాలుగా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు.
పోలీస్ స్టేడియం పేట్ల బుర్జుకు తరలింపు : గోషామహల్‌లోని పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తరలింపు కోసం పేట్ల బుర్జులోని పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీ, చుట్టూ ఉన్న స్థలాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించే 15 నర్సింగ్ కాలేజీ భవనాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది నుంచే నర్సింగ్ కాలేజీలను అద్దె భవనాల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు.