తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల వైపా? అదానీ వైపా? - కేసీఆర్, బీఆర్​ఎస్ వైఖరేంటో చెప్పాలి : సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH REDDY IN CHALO RAJBHAVAN

టీపీసీసీ ఆధ్వర్యంలో 'చలో రాజ్‌భవన్' కార్యక్రమం - 75 ఏళ్ల దేశ ప్రతిష్టను బీజేపీ భగ్నం చేసిందన్న సీఎం రేవంత్‌ రెడ్డి - అదానీపై విచారణకు జేపీసీ నేతృత్వం వహించాలని డిమాండ్‌

CM WITH MINISTERS
CM REVANTH REDDY IN CHALO RAJBHAVAN (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

TPCC Chalo Rajbhavan in Hyderabad : అదానీపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్​ఎస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని సీఎం రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ తన వైఖరి ఏమిటో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అదానీ అవినీతి అక్రమాలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయడానికి బీజేపీ చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఏఐసీసీ చలో రాజ్​భవన్‌కు పిలుపునిచ్చింది.

రోడ్డుపైనే బైఠాయించిన సీఎం : రాజ్‌భవన్‌కు దగ్గరలోనే పోలీసులు నిలుపుదల చేయడంతో అక్కడే బైఠాయించి ప్లకార్డులు పట్టుకుని అదానీకి, ప్రధానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీఎం రేవంత్‌ రెడ్డి తప్పుబట్టారు. అదానీ అవినీతి, అక్రమాలపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అభియోగాలు మోపినప్పుడు జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేయడానికి ఇబ్బంది ఏంటని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

"మణిపూర్‌ గత కొంతకాలంగా అల్లర్లతో అట్టుడికిపోతోంది. ప్రధాని ఎందుకు ఆ రాష్ట్రాన్ని సందర్శించి శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి చర్యలు తీసుకోవడం లేదు. బీజేపీతో, బీఆర్​ఎస్​ చీకటి ఒప్పందంలో భాగంగానే అదానీపై స్పందించడం లేదు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్​ఎస్​ బీజేపీకి లొంగిపోయింది. అందుకే అదానీపై బీఆర్​ఎస్ మాట్లాడటం లేదు. పార్లమెంట్‌లో బీఆర్​ఎస్​ విధానం ఏంటో చెప్పాలి. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల వైపా? అదానీ వైపా? చెప్పాలి" అని సీఎం రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

బీఆర్​ఎస్​ వైఖరి చెప్పాలి? : ఇక్కడ కాంగ్రెస్‌ను విమర్శించడం కాదని, అదానీపై, జేపీసీపై బీఆర్‌ఎస్‌ వైఖరేంటో ఎంపీలతో లేఖ రాయించాలని డిమాండ్‌ చేశారు. మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదని, వారిద్దరూ నాణేనికి బొమ్మాబొరుసు లాంటి వారని విమర్శించారు. బీఆర్​ఎస్​ జాయింట్‌ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తే శాసన సభలో తీర్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం వెల్లడించారు. దేశాన్ని దోచుకున్న అదానీపై జేపీసీ వేయడానికి ప్రధాని ఎందుకు సిద్ధంగా లేరని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. అదానీతో లాలూచీ ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద కూడా ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్‌ గౌడ్‌ నేతృత్వంలో ఈరోజు నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి రాజ్‌భవన్‌ వరకు జరిగిన ర్యాలీలో సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ, మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్‌భవన్‌ ముట్టడిలో భాగంగా నెక్లెస్‌ రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షులు తదితరులు రాజ్‌భవన్‌ వద్ద రోడ్డుపైనే బైఠాయించారు.

ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి నాయకులు ఎవరూ లేరు : సీఎం రేవంత్ రెడ్డి

త్వరలోనే కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తాం : భట్టి విక్రమార్క

ABOUT THE AUTHOR

...view details