CM Revanth Reddy Reviews on Warangal Mamnoor Airport :వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్‌లో తొలి దశను డిసెంబరులోగా పూర్తి చేసి దేశీయ విమానాల రాకపోకలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. నిత్యం ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులపై ఆరా తీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన విమానాశ్రయ భూ సేకరణ, ఇతర ప్రణాళికలపై వరంగల్ జిల్లా కలెక్టరు సత్య శారదతో పాటు ఇతర అధికారులకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. కేరళ రాష్ట్రంలోని ప్రఖ్యాత కొచ్చి అంతర్జాతీయ విమానశ్రయాన్ని అధ్యయనం చేసి అక్కడి వసతులను ఇక్కడా అమలయ్యేలా చూడాలని చెప్పారు. దీంతో ఈ నెలాఖరులో భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి కొచ్చి విమానాశ్రయంలోని వసతులు, సౌకర్యాలపై అధ్యయనానికి వెళ్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కొచ్చిన్ విమానాశ్రయం వలే మామునూరు ఉండాలని సీఎం రేవంత్ అభిలాష.
విమానాశ్రయం ప్రత్యేకతల ఎంటో తెలుసుకుందాం : -
- కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ (సీఐఏఎల్) పట్టణానికి 28 కి.మీ.ల దూరంలో నెడుంబస్సెరీ ప్రాంతంలో 1213 ఎకరాల్లో కట్టారు.
- 1999 మే 25న అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ప్రారంభించారు.
- ఏ ప్రాంతంలో నుంచైనా చేరుకునేలా 56 రేడియల్ రోడ్లను నిర్మించారు.
- సమీప పర్యాటక ప్రాంతాలైన పథనంతిట్ట, ఎర్నాకులం, కొట్టాయం, అలిప్పి నుంచి నేరుగా చేరుకులా ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారులను నిర్మించారు.
- ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్మించిన తొలి ఎయిర్ పోర్ట్ ఇది.
- 32 దేశాలకు చెందిన 10 వేల మంది ఎన్‌ఆర్‌ఐలు ఈ విమానాశ్రయ నిర్మాణానికి నిధులు ఇచ్చారు.
- కేరళలోని ఎర్నాకులం జిల్లా కేంద్రం కొచ్చిన్. ఇది సముద్ర తీర పట్టణం. కొచ్చి మహానగర జనాభా 31 లక్షలు. అక్షరాస్యత 98%.
- కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రస్తుతం 31 అంతర్జాతీయ, 22 దేశీయ గమ్యస్థానాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
- పూర్తిగా సోలార్ విద్యుత్తుతో నడిచే విమానాశ్రయాల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానంలో ఉంది.
- తొలుత దేశీయ విమానాల రాకకు టెర్మినల్‌లను నిర్మించారు. అనంతరం దశల వారీగా విస్తరణ చేశారు. ప్రస్తుతం మూడు టెర్మినళ్లు ఉన్నాయి. ఒకటి దేశీయ, రెండోది అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సేవలు అందిస్తోంది. మరో దానిలో కార్గొ సేవలను నిర్వహిస్తున్నారు.
- 2023 - 2024లో 1.08 కోట్ల ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రయాణికుల రాకపోకల పరంగా దేశంలోనే 8వ స్థానంలో ఉంది.
అభివృద్ధికి ఆస్కారం : -
- వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ ప్రారంభమైతే కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ మాదిరిగానే ఇక్కడా సమీప పర్యాటక ప్రాంతాలైన భద్రాచలం, రామప్ప, లక్నవరం, మేడారానికి మరింతగా సందర్శకులు పెరుగుతారని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. టైర్ 2 పట్టణాల్లోనూ ఐటీ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఎయిర్ పోర్ట్ కీలకంగా మారనుంది.
- దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమైతే దశల వారీగా అంతర్జాతీయ సర్వీసులను ఇక్కడి నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.