CM Revanth on New Telangana Anthem : తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. జూన్ 2న జయ జయహే తెలంగాణ గేయం జాతికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. 2.30 నిమిషాలు, 13.30 నిమిషాల నిడివితో జయ జయహే తెలంగాణ గేయం ఉంటుందన్నారు. మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గేయమని అన్నారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర గీతాన్ని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బృందం ఆలపించింది. ఈ గీతంపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
అంతకు ముందు ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్, మిత్రపక్ష నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తెలంగామ జాగృత సమితి నేతలతో సమావేశమయ్యారు. సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన బృందం జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించి వినిపించారు. గీతంలో చేసిన మార్పులను కవి అందె శ్రీ వివరించారు. 13 చరణాలతో ఉన్న పూర్తి గీతం 13 నిమిషాలు ఉంటుందని తెలిపారు. చరణాలు తగ్గించి 2.30 నిమిషాలతో రూపొందించిన గీతాన్ని కూడా వినిపించారు. రెండూ బాగున్నాయని సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలు తెలిపారు.
రాష్ట్ర అధికార చిహ్నం ఖరారు కాలేదు : మఖ్దూం మొహినుద్దీన్, కుమురం భీం, షేక్ బందగీ వంటి తెలంగాణ యోధుల పేర్లు కూడా చేర్చాలని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు సూచించగా పరిశీలించాలని కవి అందె శ్రీకి సీఎం సూచించారు. రాష్ట్ర అధికార చిహ్నాన్ని ఇంకా ఖరారు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చిహ్నంపై ఎలాంటి భేషజాలు, పంతాలు లేవన్నారు. అందరి సూచనలు తీసుకుంటామని, అవసరమైతే కేబినెట్‌లో, అసెంబ్లీలో కూడా చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని నేతలకు సీఎం తెలిపారు.