CM Revanth on paddy Purchase Centres in Telangana :ధాన్యం కొనుగోళ్లలో తాలు, తరుగు, తేమ పేరిట రైతులను మోసం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైన చోట కొత్త ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నందున అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గురువారం ధాన్యం కొనుగోళ్లు, డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కేంద్రానికి క్రమ సంఖ్య ఇవ్వాలని, సన్న వడ్ల కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు. గోనె సంచులు అందుబాటులో పెట్టాలని తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే తరలించాలని చెప్పారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ఐకేపీ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై కాల్ సెంటర్ : ధాన్యం కొనుగోలులో వ్యవసాయ అధికారులు భాగస్వామ్యం కావాలని, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు రోజూ రెండు గంటలు సమీక్షించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో రైతులు అందరూ సన్నబియ్యం పండించేలా అధికారులు చొరవ చూపించాలని ముఖ్యమంత్రి సూచించారు.