CM Revanth Reddy Review on GHMC :జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో భవన నిర్మాణాలకు ఇష్టం వచ్చినట్టుగా అనుమతులు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసహనం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన చాలా ఫైళ్లు కనిపించడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో లేకుండా ఇష్టారీతిగా అనుమతులు ఇచ్చారన్నారు. హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో 15 రోజుల్లో విజిలెన్స్ దాడులు జరుగుతాయని సీఎం స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ(HMDA) కార్యాలయంలో పురపాలక, జీహెచ్ఎంసీ, జలమండలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు నాలుగు గంటల పాటు సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికిపోతారని ఆయన అన్నారు. భవన నిర్మాణ అనుమతుల ఫైళ్లు క్లియర్‌గా ఉండాల్సిందేనని ఆన్‌లైన్‌లో లేని వాటి జాబితా తయారు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల వివరాలు ఎందుకు తొలగిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దాదాపు 3,500 చెరువల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందేనని ఆదేశించారు. ఆక్రమణ కాకుండా చెరువుల వద్ద వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
CM Revanth Fires on GHMC Officers : ఉదయాన్నే కాలనీల్లో పర్యటించని జీహెచ్ఎంసీ(GHMC) జోనల్ కమిషనర్లు ఇంటికి వెళ్లిపోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుర్చీల్లో కూర్చొనే పోస్టులు కావాలంటే వేరే ఇస్తామని అన్నారు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్‌లో వీడియో ప్రకటన బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. మల్టీ యుటిలిటీ టవర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. వీధి దీపాల వ్యవస్థ మెరుగుపరచాలని చెప్పారు. హైదరాబాద్‌లో పిల్లల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. నగరంలో ప్రైవేటు సెక్టార్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటుకు సీఎం రేవంత్ సూచించారు.
ఇంకా యుద్ధం ముగియలేదు - ఇది విరామం మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి