CM Revanth Reddy Review on Drinking Water :ఎండకాలంలో తాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించింది. వర్షాభావంతో జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలపై మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి నీటి పారుదల, పురపాలక, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా శాఖల అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రతీ నివాస ప్రాంతానికి తాగునీరు అందేలా వివిధ శాఖలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
తాగునీటి కోసమంటూ నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ 9 టీఎంసీలకు పైగా నీటిని తరలిస్తోందని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. ఏపీలో అంత పెద్దమొత్తంలో తాగునీటిని ఎక్కడ వినియోగిస్తున్నారనే గణాంకాలు సేకరించి ఇతర అవసరాలకు నీటిని తీసుకోకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీరు తీసుకోవాలంటే కేఆర్ఎంబీకి లేఖ రాయాల్సి ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏపీకి ఎంత నీరు అవసరమో సమగ్రంగా సమీక్షించి వెంటనే కేఆర్ఎంబీకి (KRMB) లేఖ రాయాలని అధికారులకు సీఎం సూచించారు.
విద్యుత్ కోతలు విధిస్తే సస్పెండ్ చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి
Revanth on Summer Drinking Water Supply in Telangana :ఏప్రిల్, మే నెలల్లో వర్షాలతో జూరాలకు నీరు రావడంతో ఇబ్బంది తలెత్తలేదని ఒకవేళ జలాలు రాకపోతే నారాయణపూర్ జలాశయం నుంచి నీటి విడుదల కోసం కర్ణాటకను కోరాల్సి ఉంటుందని అధికారులు సీఎంకు తెలిపారు. గతంలో ఎప్పుడైనా అలా తీసుకున్నారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా మూడేళ్ల క్రితం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అయితే చివరి అవకాశంగా మాత్రమే కర్ణాటకను కోరాలని తాగునీటి అవసరాల కోసం ముందుగా కేఆర్ఎంబీకి లేఖ రాయాలని రేవంత్‌రెడ్డి సూచించారు.
గతంలో వదిలేసిన అనేక నీటి వనరులను వినియోగంలోకి తెచ్చే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. కాగ్నా నుంచి తాండూర్, కొడంగల్ నియోజకవర్గాలకు నీరు వినియోగించుకునే అవకాశం ఉందని, మిషన్ భగీరథ వచ్చిన తర్వాత దానిని వదిలేశారని ఈ సందర్భంగా వివరించారు. ఎమ్మెల్యేలకు కేటాయించిన ఎస్‌డీపీ నిధుల్లో కోటి రూపాయలతో అవసరమైన చోట తాగునీటి బోర్లు, బావులు, మోటర్లకు మరమ్మతులు చేయించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో తాగునీటి సరఫరా లేదని తాను పర్యటనలో గమనించినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.