CM Revanth Review on National Highway Projects :రాష్ట్రంలో జాతీయ రహదారులకు పూర్తి వివరాలు, ప్రతిపాదనలను ఈ నెలాఖరులోగా సమర్పించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేషనల్ హైవే పనులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపట్టేందుకు, మంగళవారం జరిగిన ఎన్‌హెచ్ఏఐ ఉన్నతాధికారుల భేటీలో లేవనెత్తిన వినతులపై ఇవాళ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
జాతీయ రహదారుల స్థితిగతులపై సీఎం అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణలో పురోగతిపై ఆరా తీశారు. మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ కారిడార్ భూసేకరణపై ఆరా తీసిన సీఎం, ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, అధికారులు ప్రత్యక్షంగా హాజరవ్వగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.
భూ సేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలి : కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని వివరాలు సమర్పించారు. ఈ క్రమంలోనే జాతీయ రహదారులకు భూసేకరణ ఎందుకు జాప్యమవుతోందని కలెక్టర్లను రేవంత్ రెడ్డి ప్రశ్నించగా, రిజిస్ట్రేషన్, మార్కెట్ ధరల మధ్య భారీ వ్యత్యాసం వల్ల రైతులు ముందుకు రావడం లేదని వారు బదులిచ్చారు. భూ సేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలని సీఎం కోరారు. రైతులకు నిబంధనల ప్రకారం ఎక్కువ పరిహారం దక్కేలా చూడాలని సూచించారు.
భూములను కోల్పోతున్న రైతులను పిలిచి కలెక్టర్లు మాట్లాడాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ, ఉత్తర భాగాలకు ఒకే నంబరు కేటాయింపునకు అధికారులు చర్యలు చేపట్టాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్ఏఐ త్రైపాక్షిక ఒప్పందానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఆర్మూరు-నాగపూర్ కారిడార్లో అటవీ భూములు బదులుగా ప్రభుత్వ భూమలు కేటాయించాలని ఆయన సూచించారు.