CM Revanth Help to Medical Student : ఎంబీబీఎస్‌లో సీటు సాధించినప్పటికీ ఫీజు కట్టే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న గిరిజన విద్యార్థినికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఫీజుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందచేశారు. ఆమె ఒక నిరుపేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన అమ్మాయి. ప్రజలకు సేవలందించే డాక్టరు కావాలనే ఆశయంతో కష్టపడి చదివింది. జీవితంలో పెట్టుకున్న దిశగా లక్ష్యాన్ని సాధించింది. ఆ సందర్భంలో తన తల్లిదండ్రుల కళ్లు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి.
కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన సాయిశ్రద్ధ నీట్‌లో మెడిసిన్ సీటు సాధించినా, ఫీజు కట్టే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి రావడంతో పిలిపించి ఆర్థిక సాయం చేశారు. డాక్టర్ కావాలన్న సాయిశ్రద్ధ కల నెరవేర్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాయిశ్రద్ధ, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన : సాయిశ్రద్ధ ఓ వీడియోలో మాట్లాడుతూ ఈనాడు, ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని అన్నారు. మా మారుమూల ప్రాంతానికి సంబంధించిన వార్తను చూసి భరోసా కల్పించడం సంతోషంగా ఉందన్నారు. తన లాంటి వెనుక బడిన ఎంతోమంది విద్యార్థులకు కూడా ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.