CM Revanth Plan To Involve Transgenders As Volunteers in Traffic : నిత్యం లక్షలాది వాహనాలు, అకాల వర్షాలు, ప్రముఖుల పర్యటనలు, వారాంతపు వేళల్లో ట్రాఫిక్ జామ్‌లు ఇదీ మన భాగ్యనగర ప్రస్తుత పరిస్థితి. ఇటువంటి క్లిష్టమైన హైదరాబాద్ నగర ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం సూచించారు.
ఇప్పటి వరకూ కేవలం లఘుచిత్రాల రూపంలో కనిపించే దృశ్యాలకు వాస్తవరూపం ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నిర్ణయంతో ట్రాన్స్జెండర్ల గౌరవం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన ట్రాన్స్‌జెండర్లు 3,000 మందికి పైగా ఉంటే, నగరంలోనే 1000 మంది ఉన్నట్టు అంచనా. సమాజానికి దూరంగా తమదైన ప్రపంచంలో బతికే వీరిపై ఇప్పటికీ వివక్షత కనిపిస్తోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రాణించే ప్రతిభా సామర్థ్యం ఉన్న వీరికి ఆదరణ కరవవుతోంది.
అర్హులకు 10 రోజుల శిక్షణ, ప్రతి నెల స్టైపెండ్ :ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవటంతో కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. వీరిలో ఆసక్తి ఉన్న వారికి రాష్ట్ర పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి. విద్యార్హతలను బట్టి ఉపాధి అంశాల్లో శిక్షణనిస్తున్నాయి. వీరిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ట్రాఫిక్ విభాగంలో నియమించేందుకు సిద్ధమైంది. ఆసక్తిగల వారిని గుర్తించి నియమించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సీఎం ఆదేశించారు.