CM Revanth On Musi River Development : రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ వివరాలను సెక్రటేరియట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదని, మూసీ నది పునరుజ్జీవనమని రేవంత్‌రెడ్డి తెలిపారు. 33 టీమ్‌లు మూసీ పరివాహకంపై అధ్యయనం చేశాయన్నారు. నదీ పరివాహకంలో నివసిస్తున్న వారు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారన్న సీఎం, వారికి మెరుగైన జీవితం అందించాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు. కొందరి మెదడుల్లో మూసీలో ఉన్న మురికి కంటే ఎక్కువ విషం ఉందని, అందుకే ఈ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై ధ్వజమెత్తారు.
నిర్దయగా ఎవరినీ ఖాళీ చేయించటంలేదు : మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలన్నదే సర్కార్ ఆలోచనని అన్నారు. మల్లన్న సాగర్, వేమలఘాట్‌లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలన్న ముఖ్యమంత్రి, రాత్రికి రాత్రే పోలీసులతో కొట్టించి, గుర్రాలతో తొక్కించి మేం ఖాళీ చేయించటం లేదని అన్నారు. రంగనాయక్‌సాగర్, కొండపోచమ్మ.. ఇలా ఎక్కడికైనా తాను వస్తానన్న సీఎం, నేడు మూసీ నది కాలుష్యానికి ప్రతీకగా మారిందని వ్యాఖ్యానించారు.
"ఇది సుందరీకరణ కోసం కాదు. ఆ విధానం మాది అంతకంటే కాదు. మేము మూసీ నదిని పునరుజ్జీవం చేయాలి. మూసీ మురికిలో కాలం వెల్లదీస్తున్న తెలంగాణ ప్రజలను కాపాడాలి. వాళ్లకొక మంచి జీవనవిధానాన్ని ఏర్పరచి, ఉపాధి అవకాశాలను కల్పించాలన్నది మా ధ్యేయం."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
1600కు పైగా నివాసాలు పూర్తిగా మూసీ నది గర్భంలో ఉన్నాయన్నారు. తాము ఉన్నపళంగా, నిర్దయగా ఎవరినీ ఖాళీ చేయించటంలేదని, నిర్వాసితులకు రెండుపడక గదుల ఇళ్లు కేటాయించి, రూ.25వేలు ఇచ్చినట్లు తెలిపారు. చెరువుల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలనే హైడ్రా కూల్చింది తప్ప పరివాహకంలో ఎవరి ఇళ్లను కూల్చలేదన్నారు. చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరంలో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోందన్న సీఎం, రోడ్లపై పడిన వర్షపు నీరు చెరువుల్లోకి, నదుల్లోకి చేరాలా.. అలాగే రోడ్లపై ఉండాలా? అని ప్రశ్నించారు.
ఆ ముగ్గురూ మూసీ ఒడ్డున ఉంటారా? :మూసీ సుందరీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అనలేదా అని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి, అడ్డుకుంటున్న నేతలు 3 నెలలు పాటు మూసీ ఒడ్డున జీవించి చూపాలని సవాలు విసిరారు. కేటీఆర్, హరీశ్‌రావు సహా ఈటల రాజేందర్ 3 నెలలు మూసీ ఒడ్డున ఉండాలని, వాళ్లు 3 నెలలు అక్కడ ఉంటామంటే కావాల్సిన వసతులు కూడా కల్పిస్తామని విమర్శించారు. ఆ ముగ్గురూ మూడు నెలలు అక్కడ ఉంటే, ఈ ప్రాజెక్టును ఆపేస్తామన్నారు. మూసీ పరివాహకంలోనే ఉండి ప్రజల కోసం పోరాడాలి, వారి జీవితం బాగుందని నిరూపించాలని సీఎం అన్నారు. మూసీ ప్రజల కోసం ఏం చేద్దామో అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలి లేదా మూసీ పునరుజ్జీవం కోసం వారి (విపక్షాలు) వద్ద ఉన్న ప్రణాళిక చెప్పాలని కోరారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలన్న సీఎం, విపక్ష నేతల సందేహాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.
నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ! - ఎల్లుండి దిల్లీకి సీఎం రేవంత్ పయనం
తెలంగాణ సాధించుకోవడానికి 'అలయ్ బలయ్' స్ఫూర్తిగా పని చేసింది : సీఎం రేవంత్ రెడ్డి