CM Revanth Reddy Seoul Tour Updates Today :రాష్ట్ర అభివృద్ధే నినాదంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటన సాగుతోంది. 8రోజుల పాటు అమెరికాలో పర్యటించి వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న బృందం, తాజాగా దక్షిణకొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో మెగా కారు టెస్ట్ సెంటర్‌ను స్థాపించేందుకు కంపెనీ ఆసక్తి చూపినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
సియోల్‌లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. భారతీయ వినియోగదారుల కోసం బెంచ్‌మార్క్ ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హ్యుందాయ్ ప్రతినిధులు తెలిపారు. హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన అనుబంధ సంస్థ హెచ్ఎంఐఈ ద్వారా తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయం నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థతో తెలంగాణలో వ్యాపారం చేసేందుకు హెచ్ఎంఐఈ వంటి అత్యుత్తమ కంపెనీలు ముందుకు వస్తున్నాయని సీఎం తెలిపారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు.
టెక్స్‌టైల్ ప్రతినిధులతో భేటీ :వరంగల్ టెక్స్ టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తంచేశాయి. కొరియా పర్యటనలో భాగంగా బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్ కాకతీయ మెగాటెక్స్ టైల్ పార్కులో పెట్టుబడి పెట్టాలని కోరారు. టెక్స్ టైల్ రంగం విస్తృతికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ, స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు అనుకూలంగా ఉందని సీఎం తెలిపారు.