CM Revanth Reddy Launches T-SAFEApp : మహిళల కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు వారి భద్రత కోసం మరో ముందడుగు వేశారు. మహిళల భద్రత కోసం ఏకంగా ఓ అప్లికేషన్ను రూపొందించారు. రాష్ట్ర పోలీసులు రూపొందించిన ‘టీ-సేఫ్’ యాప్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీ-సేఫ్ యాప్ మాత్రమే కాదని, అది సేవ అని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ‘ట్రావెల్ సేఫ్’ పేరిట తెలంగాణ మహిళా భద్రత విభాగం అందుబాటులోకి తెచ్చిన అందరూ వినియోగించుకోవాలని సూచించారు. వీటిని పొందేందుకు స్మార్ట్ ఫోన్ ఉండాల్సిన అవసరం లేదని, యాప్‌ను డౌన్‌లోడ్ చేయనక్కర్లేదని తెలిపారు. మహిళల చేతిలో బేసిక్ ఫోన్ ఉన్నా టీ-సేఫ్ సేవల్ని పొందవచ్చని వెల్లడించారు.
T-SAFE App For Women Safety :మహిళలు, చిన్నారుల భద్రతకు నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర పోలీసుల్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళాశక్తి విధానాన్ని ప్రకటించిన రోజే ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ శిఖా గోయెల్ పాల్గొన్నారు.