CM Revanth Reddy Launch Rythu Nestham Program :వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు విస్తరణ సేవలు విస్తృతం చేసేందుకు రైతు నేస్తం పేరిట రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికలకు రూ.97 కోట్లలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేయనున్నారు. తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ను ప్రారంభించారు.
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపట్టిన ఈ ప్రాజెక్టులో వ్యవసాయ నిపుణులు నేరుగా గ్రామాల్లో, పంట పొలాల్లో ఉండే రైతులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలకు పరిష్కార మార్గాలు సూచిస్తారు. ప్రతి సీజనులో రైతులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు సూచనలిచ్చేలా ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కరవు పరిస్థితులు నెలకొన్నాయని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. సరైన వర్షపాతం లేక రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుందని తెలిపారు. నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు ప్రస్తుత కరవు పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఎంత కష్టం వచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. కరవు పరిస్థితులను కలిసికట్టుగా ఎదుర్కొందామని రైతులకు పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పాలమూరు-రంగారెడ్డి నిధులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం : కాంగ్రెస్