CM Revanth Inaugurate Uppal STP Center :రాష్ట్ర ప్రభుత్వం మూసీనదిపై దృష్టి సారించిందని, నగరంలోని ప్రతీ గల్లీ నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ది చేశాకే మూసీలోకి వదిలేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth) పేర్కొన్నారు. లండన్ థేమ్స్ రివర్ డెవలప్మెంట్ తరహాలో రూ.50 వేల కోట్లతో మూసీ రివర్ డెవలప్మెంట్ చేపట్టబోతున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. ఇవాళ ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన ఎస్టీపీ కేంద్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే 25 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ హయాంలోనే ముందడుగు పడిందని, నగర సమస్యలను వేగంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. నగర అభివృద్ధికి కీలకమైన చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే వారి విషయంలో ఎవరినీ ఉపేక్షించలేది లేదని హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
Musi Riverfront Beautification Project : సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే మూసీ నది(Musi River) అభివృద్ధిపై దృష్టిసారించారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.1000 కోట్ల నిధులను సైతం కేటాయించారు. మూసీపునరుద్ధరణ, సుందరీకరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం లండన్‌లో పర్యటించారు. లండన్ నగరంలోని థేమ్స్ నదిపై అధ్యయనం చేశారు. లండన్‌పోర్ట్, థేమ్స్ నిర్వహణపై నిపుణులతో రేవంత్‌రెడ్డి చర్చించారు. మూసీ అభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి లండన్ అధికారులను కోరారు.