CM Revanth Reddy Comments on KCR Latest : 1948 సెప్టెంబర్ 17కు ఎంతో ప్రాముఖ్యత ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అలాగే 2023 డిసెంబర్ 3కు చరిత్రలో అంతే ప్రాముఖ్యత ఉన్నట్లు చెప్పారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం రాచరిక పాలన అంతమైందని, 2023 డిసెంబర్ 3న కేసీఆర్ పాలన అంతమైందని తెలిపారు. తమ వారసులే అధికారంలో ఉండాలని నిజాం నవాబు కోరుకున్నారని, అభివృద్ధి చేశాను కాబట్టి తానే అధికారంలో ఉండాలనుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది మీడియా కార్యక్రమంలో పాల్గొని రేవంత్ మాట్లాడారు.
Revanth Fires on BRS : నిజాం లాగే కేసీఆర్ కూడా రాచరికాన్ని తేవాలని చూశారని రేవంత్‌రెడ్డి (Revanth Fires on KCR) ఆరోపించారు. వారసులను సీఎం చేయాలని ఆయన అనుకున్నారని విమర్శించారు. వారసత్వాన్ని తలపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందన్న రేవంత్ వాటికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు అధికారం నుంచి దించారని వివరించారు. నిజాం నకలునే కేసీఆర్ చూపించారని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు.
'ప్రజాస్వామ్యంపై కేసీఆర్‌కు నమ్మకం లేదు. ఏనాడు ప్రజల స్వేచ్ఛను కేసీఆర్ గౌరవించలేదు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయ్యాయి. ధర్నాచౌక్‌లో నిరసనలకు అనుమతులు ఇచ్చాం. నియంత ఎప్పుడూ సంస్కృతిని ధ్వంసం చేయాలని చూస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కేసీఆర్ నాశనం చేశారు. తెలంగాణలో టీజీ బదులు టీఎస్ తీసుకొచ్చారు. టీఆర్‌ఎస్‌కు నకలుగానే టీఎస్ అనేది తీసుకొచ్చారు. జయ జయ తెలంగాణ పాటను కేసీఆర్ రద్దు చేశారని' రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత నాది : రేవంత్ రెడ్డి
"రాష్ట్రం వచ్చాక కవులు, కళాకారులు నిరాధరణకు గురయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేస్తున్నాం. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తల్లి విగ్రహం చేయిస్తాం. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు పనిలో స్వేచ్ఛను ఇచ్చాం. 26 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఇప్పటి వరకు 8 లక్షల కుటుంబాలు రూ.500 సిలిండర్ అందుకున్నాయి. 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అందుకున్నాయి." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి