CM Revanth Reddy Chit Chat On Telangana Budget : గత ప్రభుత్వం మాదిరి అబద్ధాల బడ్జెట్ ప్రవేశపెట్టకుండా వాస్తవిక బడ్జెట్(Telangana Budget) ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ఎమ్మెల్యేలనే కాదు, ప్రతిపక్షాలనూ మేడిగడ్డకు తీసుకెళతామని స్పష్టం చేశారు. అనంతరం మేడిగడ్డ అక్రమాలపై న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టులపై న్యాయ విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు.
మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగిబాటుపై విజిలెన్స్ విచారణలో ప్రాథమికంగా చర్యలు తీసుకున్నామని, జ్యూడీషియల్ విచారణ తర్వాతనే ఈ విషయంపై ముందుకెళతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే సచివాలయం, అమరవీరుల స్తూపం, అంబేడ్కర్ విగ్రహం ఏర్పాట్లపై విచారణ జరిపిస్తామని అన్నారు. నిధులు కేటాయింపు, వ్యయాలపై కూడా విచారణ చేస్తామని పేర్కొన్నారు.
CM Revanth Reddy Chit Chat :ఆర్థిక మంత్రి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తాను అభినందిస్తున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చినా తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కేంద్రాన్ని అదనంగా అడిగి కూడా నిధులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలు పొడిగింపు తన చేతిలో లేదని సీఎం అన్నారు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు.