These Foods That Are Good Cleaners : ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలోనే అందరూ కిచెన్ ప్లాట్‌ఫామ్, ఫ్లోరింగ్, గృహాపకరణాలు.. ఇలా ఇంటిని, ఆయా వస్తువుల్ని శుభ్రం చేయడానికి మార్కెట్లో లభించే రకరకాల క్లీనింగ్ ప్రొడక్ట్స్‌ని కొనుగోలు చేస్తుంటారు. కొందరైతే ఈ ఉత్పత్తుల కోసం బ్రాండ్ పేరుతో బోలెడంత డబ్బు ఖర్చు పెడుతుంటారు. అయితే, కిచెన్లోనే సహజసిద్ధమైన క్లీనర్స్ ఉండగా బయట వాటి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం దండగ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇంట్లో లభించే ఈ పదార్థాలనే మంచి క్లీనింగ్ ఏజెంట్స్‌గా ఉపయోగించవచ్చంటున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మచెక్క : కిచెన్ ప్లాట్‌ఫామ్, సింక్, చాపింగ్ బోర్డు, కత్తులు వంటి వాటిపై ఎప్పుడూ తేమ ఉండడం వల్ల ఒక్కోసారి నీచు వాసన వస్తుంటాయి. అలాంటి టైమ్‌లో వాటిని నిమ్మచెక్కతో రుద్ది క్లీన్ చేసుకుంటే చాలు. ఈజీగా శుభ్రపడడమే కాకుండా మంచి సువాసనా వెదజల్లుతాయంటున్నారు నిపుణులు. అదేవిధంగా ఇత్తడి పాత్రలు, వస్తువులను మెరిపించడంలో నిమ్మలోని ఆమ్లగుణాలు చాలా బాగా సహకరిస్తాయంటున్నారు.
బేకింగ్ సోడా : ఇది ఒక మంచి సహజసిద్ధమైన క్లీనింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. ఇందుకోసం కొద్దిగా బేకింగ్ సోడా, గోరువెచ్చని వాటర్ కలిపి పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని కిచెన్ ప్లాట్‌ఫామ్, క్యాబినెట్స్ వంటి జిడ్డుగా ఉన్న ప్రదేశాల్లో, దుస్తులపై పడిన గ్రీజు మరకలు ఉన్న చోట అప్లై చేసుకోవాలి. కాసేపు ఆగి శుభ్రం చేసుకుంటే చాలు. ఈజీగా వాటి జిడ్డుదనం తొలగిపోవడమే కాకుండా దుర్వాసనలు కూడా మాయమవుతాయంటున్నారు.
వెనిగర్ : వస్తువులపై మరకల్ని పోగొట్టడంలో వెనిగర్ కూడా చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. దీనికోసం ఒక స్ప్రే బాటిల్లో వెనిగర్, వాటర్‌ని సమపాళ్లలో తీసుకొని కలుపాలి. ఆపై మీరు క్లీన్ చేయాలనుకుంటున్న వస్తువులపై దాన్ని స్ప్రే చేసి పొడిక్లాత్‌తో తుడిచేస్తే సరిపోతుందట. అదేవిధంగా.. కుళాయి, షవర్‌హెడ్ వంటివి మూసుకుపోయినప్పుడు వెనిగర్‌ను డైరెక్ట్‌గా వాటి ఓపెనింగ్ దగ్గర స్ప్రే చేసి కాసేపు అలా వదిలేస్తే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు.
కాఫీ పొడి : కొన్ని పాత్రలు మాడిపోయినప్పుడు వాటిని ఎంత తోమినా ఆ మరకలు అంత ఈజీగా తొలగిపోవు. అలాంటి టైమ్‌లో కాఫీ పొడిని వాటిపై చల్లి.. కాసేపటి తర్వాత సాధారణంగా తోమితే చాలు. మరకలు ఈజీగా తొలగిపోయి తళతళా మెరుస్తాయంటున్నారు నిపుణులు. అలాగే.. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటివి కట్ చేసినప్పుడు చేతుల నుంచి అదో రకమైన స్మెల్ వస్తుంటుంది. ఆ టైమ్‌లో కాస్త కాఫీ పొడి రుద్దుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
టీ బ్యాగ్స్ : పాత్రలు మాడిపోయినా, వాటిపై జిడ్డు మరకలైనా వాటిని పోగొట్టడం టీ బ్యాగ్స్ చాలా బాగా సహకరిస్తాయట. ఇందుకోసం ఒకట్రెండు టీబ్యాగ్స్ నానబెట్టిన నీటిలో అలాంటి పాత్రలను వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఆపై నెక్ట్ డే క్లీన్ చేసుకుంటే చాలు ఈజీగా అవి శుభ్రపడతాయంటున్నారు.
టమాటా కెచప్ : చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండే రాగి వస్తువులు ఇంటికి కొత్త కళను తీసుకొస్తాయి. కానీ, కొన్నాళ్లకు గాలి తగలడం వల్ల అవి నల్లగా మారతాయి. అక్కడక్కడా మరకలు పడినట్లుగా తయారవుతాయి. అలాంటప్పుడు కొద్దిగా టొమాటో కెచప్‌ను ఒక టిష్యూ పేపర్‌పై వేసి దాంతో ఆయా వస్తువులపై రుద్ది.. ఆపై సాధారణ నీటితో క్లీన్ చేసుకుంటే చాలు. వాటిపై ఉండే మరకలు తొలగిపోయి కొత్తవాటిలా తళతళా మెరుస్తాయంటున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :
ఎంత తోమినా గిన్నెల మీద జిడ్డు పోవడం లేదా? - ఇలా చేస్తే చాలు చిటికెలో మాయం!
సూపర్ టిప్స్ : అద్దాలు, గాజు వస్తువులపై మరకలు ఎంతకీ పోవట్లేదా? - చిటికెలో కొత్తవాటిలా మెరిపించండి!