CM Revanth Review on RRR : ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు పరిహారం ఖరారు విషయంలో ఉదారంగా వ్యవహరించాలన్నారు. రైతులకు వీలైనంత ఎక్కువ పరిహారం అందేలా ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు చూడాలని సీఎం సూచించారు. ఆర్ఆర్ఆర్, జాతీయ రహదారుల భూ సేకరణ, పరిహారం, హామ్ విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
భూ సేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులతోనూ చర్చించాలని అధికారులకు సీఎం తెలిపారు. తరచూ రైతులతో సమావేశమై ఆయా రహదారుల నిర్మాణాలతో కలిగే ప్రయోజనాలను వివరించి ప్రయోజనాలను వివరించడం ద్వారా భూ సేకరణను వేగవంతం చేయవచ్చునని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి ఎన్‌హెచ్ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున.. హెచ్ఎండీఏతో భూసేకరణ అలైన్‌మెంట్ చేయించాలని సీఎం తెలిపారు. హైదరాబాద్‌ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేయాలన్నారు. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.
అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోంది :మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా సాగే నాగ్‌పూర్-విజయవాడ ఎన్‌హెచ్-163జీ రహదారి, ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల రహదారి ఎన్‌హెచ్-63, జగిత్యాల-కరీంనగర్ ఎన్‌హెచ్ 563 రహదారుల నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు ఇచ్చారు. ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియల్‌ను సీఎం ప్రశ్నించారు.
పది రోజులకోసారి సమీక్ష :గతంలో కొన్ని నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు తలెత్తాయని పీసీసీఎఫ్ బదులిచ్చారు. రాష్ట్రస్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కారిస్తామన్నారు. అలాగే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించిన అంశాలపై వెంటనే నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ఆర్ అండ్ బీ, అటవీ శాఖ నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమించాలని సీఎం సూచించారు.