CM Revanth order to investigate Dharani Agency : ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో ధరణి కమిటీతో సమావేశమైన అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. లక్షలాది రైతుల భూ రికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. గోప్యంగా ఉండాల్సిన భూములు, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడాన్ని సీఎం తప్పుపట్టారు.
CM Revanth Review on Dharani Portal :ధరణి పోర్టల్లో(Dharani Portal)భూముల రికార్డుల డేటాకు భద్రంగా ఉన్నట్లేనా అని సీఎం అధికారులను అడిగారు. విలువైన భూములకు పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందన్న సీఎం అనుమానం వ్యక్తం చేశారు. బిడ్ దక్కించుకున్న కంపెనీ మారితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ప్రశ్నించారు. భూముల రికార్డులను విదేశీ కంపెనీలకు అప్పగించే నిబంధనలున్నాయా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 2018లో టెక్నికల్, ఫెనాన్సియల్ బిడ్డింగ్, అర్హతల ఆధారంగా ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీకి ధరణి పోర్టల్ డిజైన్ డెవెలప్మెంట్ ను అప్పగించిందని అధికారులు సీఎంకు తెలిపారు.
అయితే ఆ కంపెనీ దివాళా తీసిందని, ఆ తర్వాత టెర్రాసిస్ అని పేరు మారడంతో పాటు డైరెక్టర్లందరూ మారిపోయారని వివరించారు. ఆ తర్వాత వాటాలు అమ్ముకొని ఫాల్కాన్ ఇన్వెస్టెమెంట్ కంపెనీకి చేతులు మారాయని తెలిపారు. అయితే బిడ్ దక్కించుకున్న కంపెనీ మారిపోతే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. భూముల రికార్డుల డేటాను విదేశీ కంపెనీలకు కూడా అప్పగించేందుకు నిబంధనలు అంగీకరిస్తాయా అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు.