తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం రేవంత్‌రెడ్డి 'మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర' షెడ్యూల్​ ఇదే! - CM REVANTH MUSI SANKALP YATRA

నేడు సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర - సంగెం నుంచి సీఎం మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర - మూసీ పునరుజ్జీవ సంకల్ప రథం పైనుంచి ప్రసంగించనున్న సీఎం

CM Revanth Musi Punarujjevana Sankalp Yatra
CM Revanth Musi Punarujjevana Sankalp Yatra (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2024, 8:59 AM IST

CM Revanth Musi Punarujjevana Sankalp Yatra :మూసీ పునరుజ్జీవం కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ మూసీ వెంబడి పాదయాత్రతో మరో అడుగు ముందుకు వేయనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీవ్ర నష్టం వాటిళ్లుతుండటంతో పరీవాహక ప్రాంత రైతుల కష్టనష్టాలు తెలుసుకునేందుకు స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. క్షేత్ర స్థాయిలో సీఎం పాదయాత్ర చేయడం ద్వారా మూసీ ప్రక్షాళనకు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతన్నల నుంచి మరింత మద్దతు కూడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మూసీ ప్రక్షాళన దిశగా :తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. సౌత్​ కొరియాలోని హాన్‌ నది మాదిరి పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే డీపీఆర్‌ తయారు చేసేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అయిదు కంపెనీలకు రూ.141 కోట్లతో టెండర్లు ఇచ్చింది. ఈ కంపెనీలు సమగ్రమైన డీపీఆర్‌ను ఇచ్చేందుకు 18 నెలలు గడువు విధించింది. ఇదిలా ఉండగా నది మధ్యలో ఆక్రమణలకు పాల్పడిన పేదలను ఖాళీ చేయించి వారికి పునరావాసం కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినప్పటికీ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ వచ్చాయి.

ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా :మూసీ పునరుజ్జీవం అని ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ సుందరీకరణ, లక్ష యాభై వేలు కోట్లు వ్యయం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నదీపరివాహకప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ మురికినీటితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో నదీపరివాహక ప్రాంతంలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తూ వస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్‌ నగరంలోనూ ఇదే తరహాలో పార్టీ నాయకులను భాగస్వామ్యం చేసి నదిని ఆక్రమించుకున్న పేదల్లో, బఫర్‌ జోన్‌లో నివసిస్తున్న ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని నిర్ణయించింది. మీడియాలో లేనిపోని అపోహలు సృష్టించే కథనాలు రాకుండా అడ్డుకట్ట వేసేందుకు ఇటీవల మీడియాను కూడా దక్షిణ కొరియా పర్యటనకు తీసుకెళ్లి అక్కడ హాన్‌ నది గతంలో ఎలా ఉండింది? పునరుజ్జీవం తరువాత ఏలా మారింది? అక్కడ ఏవిధంగా పర్యాటకం అభివృద్ధి చెందింది? అనేవి స్వయంగా చూసేందుకు అవగాహన కల్పించారు. పచ్చని వాతావారణం, అకాశాన్నంటే భవనాలు నిర్మాణం, మురికినీరు శుద్ది, విద్యుత్ ఉత్పత్తి ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అక్కడ ఏవిధంగా డెవలెప్‌మెంట్‌ చేశారో మీడియా స్వయంగా చూసి వచ్చేట్లు పర్యటన నిర్వహించారు.

సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర :ఇప్పుడు తాజాగా జనంలో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు రైతులతో స్వయంగా సీఎంనే ఇంటరాక్షన్‌ కావడంతో క్షేత్రస్థాయిలో వాస్తవ సమస్యలు తెలిసి వస్తాయని, వాటిని అధిగమించేందుకు ఏవిధంగా ముందుకు వెళ్లాలో తెలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మూసీ వెంబడి పునరుజ్జీవ సంకల్పయాత్ర చేస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్‌ రెడ్డి జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి కుటుంబ సమేతంగా బయలుదేరి బేగంపేట ఎయిర్​పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదగిరి గుట్ట చేరుకుంటారు.

ఇదీ సీఎం రేవంత్ రెడ్డి బర్త్​ డే షెడ్యూల్ :ఉదయం 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటారు. ఉదయం11.30లకు యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలు దేరి మధ్యాహ్నం 1.30లకు సంగెం చేరుకుంటారు. అక్కడ నుంచి సీఎం మూసీ నది పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర మొదలవుతుంది. మూసీనది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలో మీటర్ల పాదయాత్ర చేస్తారు. భీమలింగం నుంచి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంట సంగెం - నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేస్తారని పార్టీ నాయకులు వెల్లడించారు. నాగిరెడ్డిపల్లి వద్ద మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తారు. అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్‌ బయలు దేరతారు.

మూసీ చరిత్ర :వాస్తవానికి మురికి కూపంగా మారిన మూసీ చరిత్ర చూసినట్లయితే కృష్ణానది ఉపనది మూసీ. వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్‌ నగరాన్ని రెండు పాయలుగా చీల్చుకుంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా దాదాపు 240 కిలోమీటర్లు ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఈ నది పుట్టినప్పటి నుంచి రెండు సార్లు పడ్డ వరదలు వచ్చి లక్షల సంఖ్యలో ప్రజలు వరదల్లో కొట్టుకుపోయారు. ఒకప్పుడు నల్గొండ జిల్లాకు తాగు, సాగు నీరు అందించే మూసినది క్రమంగా ఆక్రమణలకు గురవుతూ వచ్చింది.

నగరాభివృద్ధి జరుగుతున్న కొద్దీ ఆక్రమణలు పెరగడం, పారిశ్రామీకరణ జరగడం వాటి నుంచి వచ్చే వ్యర్థాల రూపంలో రసాయనాలు ఇందులో కలుస్తున్నాయి. దింతో ఈ నది క్రమంగా మురికి కూపంగా మారింది. నదిలో ప్రవహించే నీరు విషపూరితంగా మారాయి. ఈ రసాయన వ్యర్థాలతో కూడిన మురికి నీరుతో నల్గొండ జిల్లా వాసులు తీవ్రంగా నష్టపోతున్నారు. రసాయనాలతో ప్రవహిస్తుండడంతో భూగర్భ జలాలు కూడ కలుషితం అయ్యాయి. పండిన పంటలు రసాయనాల వాసనతో తినలేని పరిస్థితులు దాపురించాయి. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా దాదాపు 55 కిలోమీటర్లు మూసి నది వడ్డున ఉన్న వేలాది కుటుంబాలు దుర్వాసన, దోమలతో అల్లాడి పోతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని మూసిని ప్రక్షాళన చేసి పునర్జీవింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సుందరీకరణ కాదు - మూసీ నది పునరుజ్జీవం : సీఎం రేవంత్‌

మూసీని అడ్డంపెట్టుకుని ఎంతకాలం బతుకుతారు - హైదరాబాద్​లో మీ భరతం పడతా : సీఎం రేవంత్​ రెడ్డి - Telangana Family Digital Cards

ABOUT THE AUTHOR

...view details