CM Revanth Meet Dharani Committee : ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) అధికారులను ఆదేశించారు. మార్చి మొదటి వారంలోనే అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగు దరఖాస్తుల పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కమిటీ సూచనల మేరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో(Dharani) పెండింగులో ఉన్న 2 లక్షల 45 వేల దరఖాస్తుల పరిష్కరానికి అవసరమైన చర్యలుపై సీఎం చర్చించారు. రైతులను మరింత ఇబ్బంది పెట్టకుండా వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2020లో అమల్లోకి వచ్చిన ఆర్ఓఆర్(ROR) చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి వివరించింది.
Dharani Committee Recommendations : కేవలం మూడు నెలల్లో హడావుడిగా భూ సమగ్ర సర్వే చేసి, ఆ రికార్డులను ప్రామాణికంగా తీసుకోవటంతో సమస్యలు, రికార్డుల వివాదాలు పెరిగాయని(Dharani Committee) కమిటీ సభ్యులు తెలిపారు. లక్షలాది సమస్యలు తలెత్తాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తోందని ధరణి కమిటీ తెలిపింది. ధరణిలోని 35 మాడ్యుళ్లు ఉండటంతో ఏ సమస్యకు ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలో అర్థం కాక రైతులు ఇబ్బంది పడుతున్నారని సీఎంకు ధరణి కమిటీ తెలిపింది.
లక్షల సంఖ్య దరఖాస్తులను ఇప్పటికే తిరస్కరించారని, ఒక్కో తప్పును సవరించుకోవడానికి దాదాపు వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించడం రైతులకు భారంగా మారిందని కమిటీ పేర్కొంది. రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలోని భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని సమావేశంలో చర్చ జరిగింది. ధరణి డేటానే వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకోవడంతో, రైతుబంధు రూపంలో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని తెలిపింది.