CM Revanth Delhi Tour Today :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల బృందంతో ఇవాళ, రేపు రెండు రోజులు దిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు కూడా దిల్లీ వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధికార ప్రతినిధి సుర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరు కావడంతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
Revanth Reddy Visit Delhi Today : ప్రధానంగా లోకసభ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇటీవల హస్తం పార్టీలోకి చేరికలు పెరగడం, మరికొందరు నాయకులు చేరేందుకు సిద్ధంగా ఉండటం గురించి హైకమాండ్‌తో కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. అదేవిధంగా శాసనసభ ఎన్నికల సమయంలో టికెట్ రాని నాయకులకు, పార్టీ గెలుపుకు పని చేసిన నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే వీటి భర్తీ విషయంలో గత కొన్నిరోజులుగా కసరత్తు కొనసాగుతోంది.
ఇప్పటికే దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శులు ఇందుకు సంబంధించిన జాబితాలను సిద్దం చేశారు. సీనియర్ నాయకులతో కూడా చర్చించిన పీసీసీ అధ్యక్షుడు,సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఏఐసీసీతో సమావేశమై తుది నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై చర్చించనున్నట్లు సమాచారం.