CM Revanth Delhi Tour : రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్ష పదవితోపాటు, మంత్రి వర్గ విస్తరణపై దిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రాష్ట్ర నాయకులు ఇవాళ సమావేశమవుతారు. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పార్టీ కోర్ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్సీలు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు. ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోపాటు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో వీరు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆరుగురిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం :సీఎంతో సహా ఇప్పుడున్న 12 మంది మంత్రులకు అదనంగా మరో ఆరుగురిని మంత్రిమండలిలోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది. కానీ పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల జాబితా మాత్రం చాంతాడంత ఉంది. ఇందులో రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఉండడంతో సామాజిక సమతుల్యత పాటించడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దానిని అధిగమించేందుకు నాయకులు పలు మార్లు మేధోమథనం జరిపినా కూడా ఏకాభిప్రాయం రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.
మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చే ఛాన్స్ :ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న సందిగ్ధతకు ఇవాళ తెర పడుతుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. మంత్రి పదవులను ఆశిస్తున్న ఎమ్మెల్యేలలో సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమసాగర్ రావు, మదన్ మోహన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్, బాలునాయక్, రామచంద్రనాయక్ ఉన్నారు. ఎమ్మెల్సీలు అమిర్ అలీఖాన్, కోదండ రాం తదితరులు ఉన్నారు. ఖాళీ ఉన్న ఆరింటిని భర్తీ చేసినా కూడా మంత్రి పదవులు రాకుండా మిగిలే వారెక్కువ ఉన్నారు. మంత్రి మండలిలో అవకాశం దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ఆర్టీసీ, పౌరసరఫరాలు, మూసి అభివృద్ధి ఆథారిటీ ఛైర్మన్ వంటి నామినేటెడ్ పదవులను ఇచ్చి సంతృప్తి పరచాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.