CM Revanth Announce Date on Gas, Electricity Schemes :కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 27న సాయంత్రం గృహజ్యోతి పథకం(Gruha Jyoti Scheme) కింద ఇళ్లకు ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేడారం మహాజాతరలో ఆయన వెల్లడించారు. ఈ రెండు పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నా : సీఎం రేవంత్‌రెడ్డి
మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం :రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించిందని రేవంత్ దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleshwaram Project) దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపామన్న ఆయన, కేసీఆర్ కళ్లు మూసుకుని ఫాంహౌస్‌లో ఉండడం వల్లే ఏపీ సీఎం కృష్ణా జలాలను తరలించుకుపోయారని విమర్శించారు.
"ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను 27వ తేదీ సాయంత్రం ప్రారంభించనున్నాం. ప్రధానంగా రూ.500కు సిలిండర్, తెల్ల రేషన్ ఉన్న ప్రతి పేదవాడికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హాజరుకాబోతున్నారు."-రేవంత్ రెడ్డి, సీఎం
Congress Guarantees Implementation in Telangana : విద్యుత్ విషయంలో గత ప్రభుత్వ తప్పులను ప్రజల ముందు ఉంచామన్న సీఎం పేర్కొన్నారు. అదేవిధంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలో శుభవార్త చెబుతామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత తమదన్నారు. ఉద్యోగులకు తాము అధికారంలోకి వచ్చిన మొదటి నెల 4వ తేదీనే జీతాలు ఇచ్చామన్న ఆయన, ఈనెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో ప్రెస్ అకాడమీ(Press Academy) ఛైర్మన్‌ను నియమిస్తున్నట్లు, అలానే త్వరలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.