CM Jagan Not Implement the Promises to People:కాకినాడ జిల్లా ప్రజలకు లెక్కకు మిక్కిలి హామీలు ఇచ్చిన సీఎం జగన్ ఐదు సంవత్సరాలుగా వాటిని అమలు చేయలేదు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూనే పొలాలు తడిపే ప్రాజెక్టులను ముందుకు కదలకుండా అడ్డుకుంటున్నారు. మత్స్యకారులకు మేలు చేస్తామంటూ చేపల రేవు పనులను పక్కన పెట్టారు. ఊళ్లకు ఊళ్లే కడతామంటూ పేదల ఇళ్లపై అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. జగనన్న కాలనీలను జల కాలనీలుగా మార్చేశారు. ఐదు సంవత్సరాలుగా అన్ని విధాలుగా మోసం చేసి ఇప్పుడు బస్సు యాత్ర పేరిట తమ ప్రాంతంలో పర్యటించేందుకు ఎలా వస్తున్నారని కాకినాడ జిల్లా ప్రజలు జగన్ను ప్రశ్నిస్తున్నారు.
సీఎం జగన్కు జనం కరవు - వెలవెలబోతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర - CM jagan bus yatra
కొంప కొల్లేరు చేస్తావా అన్న నానుడి గురించి కాకినాడ జిల్లా ప్రజలకు అప్పట్లో అంతగా తెలిసి రాలేదు. సీఎం జగన్ దాన్ని మార్చేసి కొంప ఏలేరు చేస్తా అన్న కొత్త నానుడిని జిల్లా ప్రజలకు పరిచయం చేశారు. ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను పూర్తిగా సీఎం జగన్ నిలిపేశారు. జలాశయం ఆధునికీకరణ మిగులు పనులకు రూ. 142 కోట్లు, రెండో దశ పనులకు రూ.150 కోట్లు ఇస్తున్నట్లు 2022 జులై 29న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో జరిగిన కాపునేస్తం కార్యక్రమంలో పాల్గొని ప్రకటించారు. కానీ నిధులు విడుదల కాలేదు. ప్రాజెక్టు తొలిదశకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తైన 52 శాతం పనులు మినహా జగన్ పాలనలో ఎలాంటి పురోగతీ లేదు.
గతంలో రూ.100 కోట్ల ఖర్చుతో చేసిన పనులు కూడా జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారాయి. మూడు దశాబ్దాల క్రితం రూ.15 కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్టు ఖర్చు ప్రస్తుతం రూ.350 కోట్లకు చేరింది. ప్రాజెక్టు కుడి కాలువ నిర్మాణానికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు 2022 నవంబరు 4న గోకవరం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించినా నేటికీ పైసా కూడా విడుదల చేయలేదు. రైతులు మాత్రం జగన్ హామీలు ఎప్పుడు నెరవేరతాయోనని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసి అలసిపోయారు.
చెట్లు నరికేయడం - దుకాణాలు తొలగిస్తున్నారంటే 'అన్నొస్తున్నట్లే' - CM Jagan Tour Trees Cuts
జిల్లాలో చేపల రేవు పూర్తైతే 2,500 పడవలు నిలిపే ఏర్పాటు ఉండేది. లక్షా 10 వేల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద, 50 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి దొరికేది. ఇంత ప్రయోజనం కలిగించే ఉప్పాడలో రూ.422 కోట్లతో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేయలేదు. గత సంవత్సరం మార్చి నాటికే నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా అవసరమైన నిధులు ఇవ్వలేదు. నిర్మాణ సంస్థకు 36 ఎకరాలకు గాను 28 ఎకరాలను మాత్రమే అప్పగించారు. 2020 నవంబరులో వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టునూ నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయలేకపోయారు. మత్స్యకారుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారు.