CM Jagan Neglect on Skill Training for Women :ఒక రాష్ట్రం పురోగమిస్తుంది అంటే మహిళల ఆర్థికంగా మెరుగ్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అందుకే మహిళల్ని ఉపాధి వైపు మళ్లించడానికి ఎన్ని నిధులు ఖర్చు చేసినా అది కీలకమైన పెట్టుబడిగానే ప్రభుత్వాలు భావిస్తాయి. కానీ జగన్ ప్రభుత్వంలో మాత్రం 'ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది' అని శుద్ధపూస కబుర్లే తప్ప వారి ఉపాధికి ఎలాంటి భరోసా ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది మహిళలకు పుట్టగొడుగుల పెంపకం నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ వరకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చింది. వారికి ఆర్థికంగా చేయూత అందించింది. జగన్ మాత్రం మహిళలకు ఉపాధి కల్పన లేకుండా పాతరేశారు. అడపాదడపా శిక్షణతో సరిపెట్టారు. ఈ ఐదేళ్లలో శిక్షణ ఇచ్చింది కేవలం 6 వేలమందికే. కొన్ని జిల్లాల్లో రెండేళ్లుగా 'నైపుణ్య శిక్షణ (Skill Training)' ఊసే లేకుండా కేంద్రాలను పాడుబెట్టారు.
మహిళలు ఉపాధి పొందేలా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో 13 మహిళా ప్రాంగణాలు ఉండగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఇవి 30 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువత, మహిళలే వీటిలో ఎక్కువగా శిక్షణ తీసుకునేవారు. తెలుగుదేశం హయాంలో నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో నిత్యం శిక్షణా తరగతులు జరిగేవి. ఉచిత భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించేవారు. వివిధ రంగాలకు సంబంధించి 30 నుంచి 90 రోజుల వ్యవధితో శిక్షణ అందించి ఆ తర్వాత అభ్యర్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. స్వయం ఉపాధి పొందేలా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేవారు. ఇలా వేలమంది లబ్ధిపొందారు. కొందరు 10 నుంచి 20 వేల వరకు ఆదాయం పొందేవారు. మహిళలు అభివృద్ధి చెందడం జగన్‌కు ఏమాత్రం నచ్చదుగా? అందుకే ఆయన అధికారంలోకి వచ్చాక వారి ఉపాధి అవకాశాలను దెబ్బకొట్టారు. నైపుణ్య శిక్షణా కేంద్రాలకు ఒక్క రూపాయైనా కేటాయించకుండా మహిళా లోకాన్ని నిలువునా మోసగించారు.
'ప్రభుత్వం ఇచ్చే డబ్బు.. మహిళల జీవితాన్ని మార్చేందుకే'
ప్రాంతానికి తగినట్లు అక్కడ ఉన్న అవకాశాలను బట్టి గతంలో వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయిస్తూ ఉచిత శిక్షణ అందించారు. టైలరింగ్, కుట్లు అల్లికలు, మగ్గం వర్క్, జూట్‌తో వస్తువుల తయారీ, సబ్బులు, శానిటరీ నాప్కిన్స్, ఫినాయిల్ తయారీ, ఎంబ్రాయిడరీ, బ్యుటీషియన్ కోర్సులు, పచ్చళ్ల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, ఫ్యాషన్ డిజైనింగ్, బేకరీ ఫుడ్స్, కంప్యూటర్, నర్సింగ్ కోర్సులు ఇలా వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి యువతకు, మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు వృత్తి సంబంధమైన శిక్షణ ఇక్కడే ఇచ్చారు. టైలరింగ్ నేర్చుకున్న వారికి ఉచితంగా కట్టుమిషన్లు పంపిణీ చేశారు. మహిళల ఉపాధికి అంతటి ప్రాధాన్యం ఉండేది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాంగణాలను ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చేందుకే ఎక్కువగా వినియోగిస్తున్నారు.
రాజమహేంద్రవరంలోని మహిళా ప్రాంగణానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడ 30 ఏళ్లలో దాదాపుగా లక్ష మందికి నైపుణ్య శిక్షణ వేల మందికి ఉపాధి కల్పన జరిగింది. కానీ ఈ కేంద్రంలోనూ గత రెండేళ్లుగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంలేదు. టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ 2016-19 మధ్య 1,590 మందికి శిక్షణ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మొదట్లో అడపాదడపా శిక్షణ ఇచ్చినా ఆ తర్వాత ఒక్క రూపాయైనా కేటాయించకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. భవనం శిథిలావస్థకు చేరింది. కుట్టుమిషన్లు, 12 కంప్యూటర్లు మూలకు చేరాయి.