AP CM Jagan Comments on Visakha Capital: విశాఖ రాజధానిపై ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా విశాఖ నుంచే పాలన చేస్తానని విజన్ విశాఖ సదస్సులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖలోనే ఉంటానని, విశాఖ పట్ల తనకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉంటానని అన్నారు. 'విజన్ విశాఖ' (Vision Visakha) సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మొత్తం ప్రపంచం విశాఖ వైపు చూస్తోందన్న ముఖ్యమంత్రి జగన్, ఐకానిక్ సచివాలయం (Visakhapatnam Iconic Secretariat), కన్వెన్షన్ సెంటర్, స్టేడియం, ఇనిస్టిట్యూట్ ఎమర్జింగ్ టెక్నాలజీ వస్తున్నాయని వీటి ద్వారా మన విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలు అందుకుంటారని తెలిపారు. వచ్చే 15 నుంచి 18 నెలల్లో భోగాపురం ఎయిర్ పోర్టు (Bhogapuram Airport) పూర్తి అవుతుందని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా ఆరు లైన్ల రోడ్డు సిద్ధమవుతోందని చెప్పారు.
రుషికొండపై హడావుడిగా 'ప్యాలెస్' - వినియోగంపై స్పష్టతేదీ జగన్?
విశాఖకు మెట్రో రైల్ వస్తుందన్న జగన్, 60:40 నిష్పత్తిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దీనిని పూర్తి చేస్తామన్నారు. విశాఖలో 27 వేల కోట్లతో అదానీ డేటా సెంటర్ వస్తోందని తెలిపారు. రానున్న ఐదేళ్లలో విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతుందని, విశాఖ సమీపంలో ఒబెరాయ్ హోటల్స్ 5 స్టార్ హోటల్స్ నిర్మిస్తోందని, తమ ప్రభుత్వం స్థలం ఇచ్చిందని గుర్తు చేశారు.