CM Jagan Cheated Kapus: జగన్ చెప్పే మాటలకు, చేతలకు పొంతనే ఉండదు. ఆయా వర్గాలకు దగా చేస్తున్నా, అంతా బ్రహ్మాండంగా సాగుతున్నట్లు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటుంటారు. అయిదేళ్ల పాలనలో సీఎంగా జగన్ కాపుల విషయంలో చేసింది ఇదే. తెలుగుదేశం ప్రభుత్వంలో కాపుల అభివృద్ధి, సంక్షేమానికి అమలైన పథకాలకు జగన్ పాతరేశారు. నిరుద్యోగ యువతకు అందే నైపుణ్య శిక్షణకు అడ్డుపడ్డారు. చాలా చోట్ల కాపు భవనాల నిర్మాణం చేపట్టకుండా వదిలేశారు.
కాపులకు ఆర్థిక చేయూత అందించేందుకు గత ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి, 2014-19 మధ్య 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జగన్ ఏటా 2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో 10 వేల కోట్లు ఖర్చు చేస్తామని మాటిచ్చి, అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారు. సీఎం పీఠంపై కూర్చున్న తర్వాత కాపునేస్తం పథకాన్ని తెచ్చి కేవలం 2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇది జగన్ ఇష్టంగా తెచ్చింది కాదు. ఆ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో మింగలేక కక్కలేక అమలు చేసిందే!
తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి, దాని ద్వారా అవకాశాలను కల్పించింది. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రాయితీతో రుణాలిచ్చింది. అలా 2 లక్షల 11 వేల మందికి 14 వందల 41 కోట్ల 75 లక్షల రూపాయల మేర రాయితీ రుణాలు అందించింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వేల మంది వారి తలరాత మార్చుకున్నారు. రాయితీలతో ఎస్‌యూవీల కొనుగోలును ప్రోత్సహించింది. ఆసక్తి ఉన్నవారికి ప్రభుత్వమే డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించింది. ఇలా మొత్తంగా 284 మందికి 21 కోట్ల 30 లక్షల మేర ఆర్థిక సాయం అందించింది.
విదేశీవిద్య పథకంపైనా జగన్ కుతంత్రాలు: కాపులకు గత ప్రభుత్వంలో అమలైన విదేశీవిద్య పథకంపైనా జగన్ కుతంత్రాలు చేస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత మూడేళ్లపాటు ఈ పథకం అమలు ఊసే ఎత్తలేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయని ఆ తర్వాత అమల్లోకి తెచ్చారు. అప్పుడూ ఎక్కడాలేని నిబంధనలు పెట్టి, అర్హుల సంఖ్య పెరగకుండా జాగ్రత్తపడ్డారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకం కింద 18 వందల 92 మంది విద్యార్థులను ఉన్నత విద్య చదివేందుకు విదేశాలకు పంపింది.
వీరికి 207 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వైసీపీ ప్రభుత్వం తొలుత 200 క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదిస్తేనే ఆర్థిక సాయం అందిస్తామని మోకాలడ్డింది. తర్వాత నిబంధనల్ని ఇంకా కఠినతరం చేసి, సబ్జెక్ట్‌ల అంశాల్ని తెరమీదకు తెచ్చారు. అదే విధంగా వాటిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదిస్తేనే సాయం అంటూ ఉత్తర్వుల్లో సవరణలు చేశారు. ఫీజుల్ని గరిష్ఠంగా కోటీ 25 లక్షల దాకా చెల్లిస్తామని ప్రకటించారు. మొత్తంగా ఇప్పటిదాకా జగన్ పాలనలో ఈ పథకం కింద అర్హత సాధించిన కాపు విద్యార్థులు 250 మంది కన్నా తక్కువే.
నైపుణ్య శిక్షణ అందివ్వడంలోనూ మొండిచెయ్యి: యువత ఉపాధి పొందడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందివ్వడంలోనూ వైసీపీ మొండిచెయ్యి చూపింది. తెలుగుదేశం ప్రభుత్వం కాపు యువతకు ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందకు అన్ని చర్యలూ తీసుకుంది. 2014-19 మధ్య 39 వేల 739 మంది యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చింది. దీని కోసం 28 కోట్ల 73 లక్షలు ఖర్చు చేసింది. విద్యోన్నతి పథకం కింద సివిల్స్ చదివేందుకు అత్యన్నత శిక్షణ సంస్థల్లో ఉచిత శిక్షణ అందించింది. దిల్లీ, ముంబయి, పుణె, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా అభ్యర్థులు కోరుకున్న చోట ట్రైనింగ్ ఇప్పించింది. ఆ ఖర్చు మొత్తాన్ని అప్పటి ప్రభుత్వమే భరించింది. దీన్ని జగన్ ఆపేశారు.